Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంద్రదత్త కథ

237

సరోజిని యొకనాఁడు లేపన సామగ్రి సంపాదించుకొని కుంచెయు రంగులభరిణియుఁ జేతంబూని మలినాంబరధారిణియై వికృతవేషముతో నింద్రదత్త యున్న ప్రాసాదముదాపునకుం బోయి పరిచారికవలనం దనరాక రాజపుత్రిక కెరింగించెను. దాదులు చెప్పినమాట విని యాబోటి యేద ? యేదీ ? ఆ చిత్రలేఖ నిట్లు తీసికొనిరండని పరిజనులఁ దొందరపెట్టినది వారు వోయి యాయింతిం దీసికొని పోయిరి. రాజపుత్రిక యామె వికృతవేషముఁ జూచి యిసిరో ? ఈ మాత్రము దానికే నన్నింత శ్రమపెట్టితిరి. చాలుఁ జాలు దీనిరూపమే క్రియాగౌరవమును సూచింపు చున్నది. ఇఁకఁ జూడనక్కరలేదు. పంపివేయుడు. ఏమో యనుకొంటినని పలికిన సరోజిని యించుక దాపునకుఁ బోయి అమ్మా ! నే నందముగా నుండుటకు బోగము మగువను కాను. నా విద్య పరీక్షింతువని వచ్చితిని. చిత్రలేఖన విద్యలోఁ బుడమిలో నన్ను మించినవారు లేరని గరువముఁ జెందుచుంటిని. పరీక్షించి చూడుము. అని సాతిశయముగాఁ బలికిన విని యవ్వనితామణి యోహో ? నీ వంతదానవా ? అట్లయినఁ బరీక్షి౦చెదఁ గాక రమ్ము, ఈ పటంబుల వ్రాయుము. నీ ప్రజ్ఞఁ జూతుము గాక యని నొడివి తనయెదుర నిలఁబెట్టి చూచుకొనుచున్న కంతు వసంతు జయంత నలకూబరుల చిత్రఫలకముల నందిచ్చినది.

సరోజిని ముహూర్తకాలమున నా చిత్తరువుల నచ్చు గుద్దినట్లు వ్రాసి యమ్ముద్దియకుఁ జూపినది ఆ నాతివ్రాఁతశక్తికి మిక్కిలి యక్కజముఁ జెందుచు రాజపుత్రి యా చిగురుబోణి సవిమర్శముగాఁ జూచి యోసీ ? నీ మొగమున కేదియో రంగుఁ బ్రామికొనినట్లున్న దేమి ? నీ పలువరుస మిక్కి.లి చక్కగా నున్నదిగదా ? యని యడిగిన నామె అమ్మా ! రంగులు తరచు వేయుచుందుము గదా ? అది మొగమున కంటుకున్నవి కాబోలు. నాయందము జోలి నీ కేల? పోనిమ్ము. నా చేత వ్రాయించిన చిత్రఫలకము లెవ్వరివని యడిగిన నమ్ముదిత యిట్లనియె.

గీ. పాకశాసను ముద్దులపట్టి యితడు
    కంతు నెయ్యంపు సఖుఁడు వసంతుఁ డాతఁ
    డితఁడు నలకూబరుండు విత్తేశసూనుఁ
    డతఁడు మదనుండు లక్ష్మిప్రియాత్మజుండు.

వీరినే యెరుంగక చిత్రలేఖనమందు నా యంతవారు లేరని పలుకుచుంటినా? యని యాక్షేపించిన విని సరోజిని అమ్మా ! వీరి నేనెరుఁగని దానను గాను. వీరి నింత వింతగాఁ జూచుచుంటివేమి యని యడిగితిననుటయు వీ రట్లు చూడఁదగని వారా యేమి? సౌందర్యనిధులు కారా ? వీరి నెంతసేపు చూచినను దృప్తి గలుగునా యని బెద్దగాఁ బొగడఁ దొడంగినది. ఆ విషయమై వారి కిట్టి సంవాదము జరిగినది.