234
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
చకో - మరి యెవ్వఁడు ? దాని కేమి కావలయును ?
పూవు - ఇక్కడనే చిత్రము. వినిన నవ్వకమానవు. ఘటదత్తుండే కులమువాఁడో తెలియదు కాని దొంగలకు నాయకుఁడట. సరోజిని తల్లి చంద్రవతి మిక్కిలి భాగ్యవంతురా లగుట ఘటదత్తుఁడు రాజకుమారుఁడని చెప్పి నలుగురు దొంగలతోఁ జంద్రవతి యింటి విటధర్మమున కఱిగి యింటిలోఁ బ్రవేశించి దానిం గట్టిపెట్టి ద్రవ్యమంతయుం దోచికొని యీ చిన్నదాని నెత్తుకొని పారిపోయి వచ్చెనఁట.
చకో -- బళా బళి ! యిుదియా? వేషము సరి సరి ఆ మర్మ మెట్లు తెలిసినది ?
పూవు - చంద్రవతి యప్పుడే యాదేశప్రభువునితోఁ జెప్పికొనిన నతండు నలుదెసలకు వారిగురుతులు సెప్పి దూతలం బుచ్చెను. వెదకికొనుచు గొందరు రాజభటులు జాడతీసి మొన్న నీయూరు వచ్చి ఘటదత్తుని బట్టుకొనిరి.
చకో - ఆహా ! మంచి సమయములో నంతరాయముఁ గలిగినదిగదా. తరువాత.
పూవు - మంత్రి పత్రికలవలన వారి చరిత్రముఁ దెలిసికొని యక్కడి రాజశాసనమునకు వెరచుచు దూతలకు లంచము లిచ్చియా యిరువురను నెక్కడికో రహస్యముగాఁ బంపివేసెను.
చకో - తనకు వారు చేసిన యుపకారమునకు మంత్రి ప్రత్యుపకారముఁ గావించెను. మంచిపనియే, తరువాత.
పూవు --- ప్రధాని యాపద్మనేత్ర వేశ్యాపుత్రిక యనియుఁ బెండ్లి యాడఁ దగినది కాదనియు వా రెందేనిం బోయిరనియు వారి చరిత్రము సుముఖని కెఱింగించెను.
చకో - సుముఖుఁ డంతటితోఁ జిత్తమును మరలించుకొనియెనా ?
పూవు - లేదు, లేదు. సరోజిని వేశ్యాపుత్రికయని విని మఱియుం గుందుచు వారి ననుగమించి యెందేనిం బోయెను.
చకో - అవును. కుల స్త్రీలకన్న బోగముదానలకు హావభావ లీలావేతృత్వ మధికముగా నుండును. అందులకే యా చిన్నది యంత సుందరముగా నున్నది. తరువాత.
పూవు -- తరువాత నేమి యున్నది ? అమ్మగా రా పెద్దకుమారునికొరకుఁ బరితపించుచున్నది.
చకో - అది యుచితమే. కాని ఘటదత్తుఁ డామత్తకాశినిని వలచి తీసికొని వచ్చినచోఁ జెల్లెలని ఊరిలో చెప్పెడిని. సుముఖునకు వివాహముఁ జేయుట నెట్లు సమ్మతించెను.