226
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
టిని. మఱియు నిట్టి సమయమున సిగ్గువిడచి మాట్లాడుచుంటినని నన్ను సిగ్గులేని దానిగా భావింపవలదు. అందులకొక కారణ మున్నది. నాయభిమతముఁ దీర్తుమంటి రేని వెల్లడించెదను. సకల విద్యాపారంగతులు మీ యెరుంగని ధర్మములుండవని మిక్కిలి వినయముగాఁ బ్రార్దించుటయుఁ దదీయ మృదుమదుర వచనోపన్యాసమునకు వెరగుపడుచు నా రాచకుమారుండు లేత నవ్వుతో నిట్లనియె.
బోఁటీ? యిట్టితరి నీ నోటిమాటలు వినుటచేఁ బరమానందమైనది. నీ కోరిక యేదియో వేగిరము వచియింపుము. అడిగినదాని కిబ్బడి యిచ్చి నీవలన మెప్పు వడయుదునని పలుకుచు మోము ముద్దిడుకొనుటయు నక్కుటిలకుంతల కొంత తొలగి తల నించుకి వంచి మాటలు తడఁబిడఁ బ్రాణేశ్వరా ! నాకామితము మీ కమితకోప కారణ మని యెరింగియుఁ దెగించి నుడువుచుంటి ధర్మసూక్ష్మము విచారించి నా తప్పు మన్నింప వలయును.
నే నై దేఁడులు వచ్చినది మొదలు కళానిధియనుగురువునొద్ద విద్యాభ్యాసము జేసితిని. ఆతండు గుట్టువిడచి నాకు సమస్త విద్యలు జెప్పెను. యౌవనారంభమందు గురుదక్షిణఁ గొని యరిగిన నన్నుఁ జూచి మోహించి వివేకము లేక యతండు తన యభిలాష వెల్లడించినఁ జింతించుచు నప్పని కడు బాపహేతువని పెక్కుభంగుల బోధించితి. అతండు నా మాటలు పాటింపక చచ్చుటకు సిద్ధమయ్యెను. ధర్మ సూక్ష్మము విమర్శించి పెండ్లి యాడిన పిమ్మటఁ బతియాజ్ఞ గైకొని నీ కామితము దీర్తునని శపథముఁ జేసి వచ్చితిని యా వృత్తాంత మంతయు నుడివి, దేవా ! ఆడి తప్పుటకంటె మహాపాతకము లే దండ్రు సత్యమందు సమస్త ధర్మములు నున్నవని శాస్త్రములు చెప్పుచున్నవి. ఇదియే నా కోరిక. అప్పని కనుజ్ఞ యిచ్చి నన్ను సత్యవచనురాలిం జేయుడని ప్రార్దించినది.
అప్పు డతండు ముక్కు పై వ్రేలిడికొనుచు బళిరా ? యిదియా ? నీ కోరిక వస్తువులో వాహనములో యనుకొంటి. చాలుఁజాలు సంతోషమైనది. మంచిమాట నగుదువు, కానిచోఁ దొలికూటమునందే సిగ్గులేక నింత చొరవగా మాట్లాడుదువా ?. అన్నా ఆడువాండ్ర మాయల సృష్టించిన విరించికే తెలియ వనినచో నితరులమాటఁ జెప్ప నేల? అని మిక్కిలి యెకసక్కెము లాడిన విని యక్కలికి యెడల గడగడ వడంక బాష్పగద్గదస్వరయై యిట్ల నియె.
ఆర్యపుత్రా ? సతులకుఁ బతికన్న దైవము లేదు. త్రికరణంబులకు భిన్నముగాఁ మీతోఁ బలికితిన యేని నేను రౌరవాదిఘోరనరకయాతనల ననుభవించి -------కాది జన్మము కెత్తకపోవుదునా ? భూతదయ బాధించుటచే గురుమరణమునకు వెరచి ధర్మమనియే యట్లు పలికి వచ్చితిని. నన్నుఁ గామతంత్రురాలిగాఁ దలంతురేని నిప్పుడ మీ పాదమూలమునఁ బ్రాణములు విడుచుదాన. పతి మెచ్చని