పుట:కాశీమజిలీకథలు-06.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభావతి కథ

221

నది. నీవు రాకతప్పదు. జాగుచేసిన వారెందేనిం బోవుదురని పెద్దగా నిర్భంధించుటయు ననుమతించి మంత్రి భార్య యప్పడే బండియెక్కి యామెతోఁగూడ వారింటి కరిగి సరోజనిం గాంచి వెరగుపడుచు నిట్లనియె.

బాలా ! నీ శీల ప్రవృత్రి యంతయు నీయిల్లాలు చెప్పినది. నీవు మా యాపద దాటింప నరుదెంచిన సరస్వతివో పార్వతివో కావలయు. ఇతరు లాప్రశ్నమున కుత్తరముఁ జెప్పలేరు. నీ వెద్దియేని తెరువూహించితేమో యెరింగింపుమని మిక్కిలి దైన్యముగాఁ బ్రార్దించిన నాలించి యమ్మించుబోణి యిట్లనియె.

అమ్మా ! దీనికిఁ బెద్దయాలోచన యక్కరలేదు. ఆ నలువురను నొక గడియ నాతో మాట్లాడునట్లు చేయుము. ఆ ముద్రిక యెవ్వరుఁ దీసినది చెప్పెదనని కొన్నిమాటలుచెప్పి యా మంత్రిభార్య నంపినది. ఆమె యింటికిఁ బోయి సరోజిని చెప్పినమాట లన్నియుం జెప్పుటయు మంత్రి విస్మయ సంతోష శంకాసమన్విత మతియై యందలములు పంపి యప్పుడే వారిని దమయింటికి రప్పించుకొనియెను. ఎట్లు చెప్పెదవు ? ఏలాగున గ్రహింతువు ? నీయొద్ద నేదియైన ప్రభావమున్నదియా? చెప్పుమని యా మంత్రి సరోజనిని భార్యచే నడిగించుచుండ నా యొద్ద నేశక్తియును లేదు. అప్పటికిఁ దోచినట్లు వక్కాణించెదనని సమాధానము చెప్పుచుండెను.

మరునాఁడు మంత్రి రాజునొద్దకుఁబోయి దేవా! మీ రడిగిన మాటలకు నా కూఁతురు సమాధానముఁ జెప్పఁగలదు నేడు సభఁ జేయింపుము. నీ నలువుర కుమారులనందు రప్పింపుము. యవనికాంతరవర్తి వియై నాకూఁతురు నీ పుత్రులతో నించుక సంభాషించి ముద్రికా తస్కరుం జెప్పునని‌ నుడువుటయు నా భూవల్లభుండు వల్లె యని మంత్రిచెప్పిన వడువున సభఁ గావింప జేసెను.

సరోజిని యందలమెక్కి వచ్చి యా సభాభవనంబునఁ దెఱచాటునఁ గూర్చుండెను. రాజపుత్రులు నలువురు నగ్రభాగంబునఁ గూర్చుండిరి. ఇఁక నీ యుపన్యాసము ప్రారంభింప వచ్చునని మంత్రి సరోజనికిఁ దెలియఁ జేసినంత నా కాంతారత్న మిట్లని చెప్పదొడంగెను.

ప్రభావతికథ

దేవప్రస్థ మను పట్టణంబునఁ గీర్తి చంద్రుడను రాజుగలఁడు. అ న్నరేంద్రునకుఁ బ్రాయము మిగిలిన తరువాత ప్రభావతియను కూతురు గలిగినది. మనుష్యులలోనేకాక సురగరుడోరగ విద్యాధర గంధర్వాది వియచ్చరులలోసైత మట్టి సుందరి లేదని చెప్పవచ్చును. ఆ బాలకుఁ బంచవర్ష ప్రాయము వచ్చినతోడనే యా రేఁడు సకలకళా నిపుణుండగు కళానిధియను బ్రాహ్మణు నుపాధ్యాయునిగా నియమించి చదివింపు చుండెను. సూక్ష్మమతియగు నా యవతియు నేడెనిమిదేఁడులలోఁ బదునాల్గు విద్యల సాంప్రదాయములం దెలిసికొని విదుషీమ తల్లియను వాడుక వడసినది.