Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

అంతలో నా పూవుబోణి మేన యౌవనము పొడసూపినది. ఉపాధ్యాయునకు దక్షిణమిచ్చి యంతఃపురముఁ బ్రవేశింపుమని తండ్రి యాజ్ఞాపించి నంత నయ్యింతి యొకనాఁడు సాయంకాలమున మణిభూషావిశేషంబులఁ గైసేసికొని పీతాంబరము ధరించి పసిఁడి పళ్ళెరమునిండ దీనారములఁ బోసికొని గురువింటి కరిగినది. అప్పుడా యొజ్జ వేదిక వజ్జం గూర్చుండి‌ యేదియో పుస్తకముఁజూచు కొనుచు మహలక్ష్మి వలెఁ దనయింటి కరుదెంచిన యమ్మించుబోణిం గాంచి మేను ఝల్లుమన నోహో ! ఈ మోహనాంగి యలంకరించుకొని వచ్చుటచే గురుతుపట్టలేక పోయితిని. నిత్యము చూచుచున్నది యైనను నేఁడు నాకు గ్రొత్త వింత గలుగఁజేయుచున్నది అయ్యారే ? ఈ సోయగము వేల్పు జవరాండ్రకైనఁ గలదా ? దీనిం బత్నిగాఁ బడయువానికి ద్రిలోకాధిపత్యమేమిటికి ? సీ ? నేనింతఁ జదివితిని. ఇట్టి భార్య లభించినదికాదు. నా జన్మము కాల్పనా? అయ్యో ? దీనిం జూచుచుండ నా మనసు వికారము నొందు చున్నది. శిష్యురాలని విరక్తిఁ జెంద డేమిపాపము ? త్రిభువనాశ్చర్యకర శోభా విరాజితమగు నీ యువతి యందమంద యా దోషమున్నది. మున్ను విధాత భారతిం జూచి మోహింపలేదా? నే నతనికన్నఁ దెలిసినవాఁడనా యేమి? ఏమైనను సరే నా మనోరధము వెల్లడింతునా ? ఇసిరో ! ఇది కడు తుచ్చేచ్చగదా ? కుసుమశర ప్రహార జర్ఝ రిత హృదయులకు వావులు నిలువవు సిగ్గు తెలియదు. ఇది నా మరణమునకే వచ్చినదని యనేక ప్రకారముల మోహపరవశుండై చింతించుచుండెను.

అప్పూబోణి దాపునకుఁ బోయి నమస్కరించుచు నార్యా ! నీవు నాకుఁ దండ్రియుంబోలెఁ గారవించుచు సకల విద్యలుం గరపితివి. నా జీవనము దారఁబోసినను నీ ఋణముఁ దీర్చుకొనఁజాలను. దేహమునకు మాత్రమే హేతుభూతుండగు తండ్రికంటె విద్యయను నేత్రముల నొసంగి యజ్ఞానాంధత్వము నశింపఁ జేసిన గురుం డెక్కొవయని పెద్దలు చెప్పుదురు. నీ శిష్యురాలిపైన ననుగ్రహముంచి యిఁక నంతఃపురవాసమున కనుజ్ఞయిమ్ము. గురుదక్షిణ స్వీకరింపుము. అని అత్యంత వినయ విశ్వాసములతో బ్రార్థించిన నా బ్రాహ్మణబ్రువుం డిట్ల నియె.

రాజపుత్రీ ! నీ వనినట్లు గురువు దైవముకన్న నధికుఁడు భక్తి గల శిష్యుండు గురుఁ డేమిచెస్పిన నట్లు చేయును. గుర్వాజ్ఞకుఁ గార్యా కార్య వివక్షతలేదు. గురువు కోరికఁ దీర్చుటే శిష్యుకృత్యమైయున్నది. నీ వట్టి దానవని నే నెరుంగుదును నాకీ దీనారములతోఁ బనిలేదు. నీ వంతఃపురమున బ్రవేశింతునని చెప్పినంతనే నా గుండె పగిలిపోవుచున్నది. ఏమి చేయుదును? ఎవ్వరియందును మమకారము బెట్టుకొన గూడదు. ఈ ప్రీతి మరణమునకే హేతువయని యనేక దీనాలాపము లాడుటయు నా కలకంఠి యిట్లనియె.

తండ్రీ ! ఉత్తములగు గురువులు పుత్రులకన్న శిష్యుల నెక్కు డు వాత్సల్యముతోఁ జూచుచుందురు. గురువు తండ్రివంటివాడగుట నెప్పుడును గురుదర్శనము