220
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
యున్నది? అతం డామాట విని యేమియుం దోచక యింటికివచ్చి మంచముపై బండుకొని విచారించుచుండెను. అతండు మిగుల ధర్మాత్ముఁ డగుట పౌరులెల్లరు గుమిఁగూడి యెవ్వరికింజెప్ప శక్యముగాని విషయముల నడిగి ప్రధానిని వంచించుట రాజనీతికిఁ గళంకమగుచున్నది. మంత్రివిషయమై చేసిన యాజ్ఞ మరలించు కొనఁగోరుచున్నామని రాజునకు విజ్ఞాపనపత్రికఁ బంపికొని యేకగ్రీవముగా మనవిఁ జేసికొనిరి. కాని రేడేమియు మన్నింపడయ్యెను. మంత్రియు మంచముఁ బట్టి మిక్కిలి దుఃఖించుచున్నాఁడు. రేపటితో నామితి సరిపోయినది ఆ దయాశాలి ప్రధానపదవినుండి తొలఁగి పోగలఁడని మేము విచారించుచున్నారమని యాకథ యంతయుం జెప్పెను. ఛీ ! ఛీ ! రాజుల కింతయు విశ్వాస ముండదుగదా? వారు వ్యాఘ్రములకంటెఁ గ్రూరులు. నమ్మియుండరాదు. అని ఘటదత్తుఁడుత్తరముఁ జెప్పెను. భోజనమైన వెనుక ఘటదత్తుఁడు సరోజినితో చెల్లీ ! నావలెనే యీ వీటి రేని ప్రగ్గడయు నిష్కారణమ యవమానితుం డగుచున్నవాఁడట. వింటివా ? యని యావృత్తాంత మెరిగించెను.
సరోజని నవ్వుచు నోహో? నలువురిలో వస్తుచోరునే నిరూపింపలేక పోయెనా? ఆ మంత్రి యంతబుద్దిమంతుండు గాఁడని యాక్షేపించుటయు ఘటదత్తుఁడు వెరగుపడుచుఁ జెప్పుటకెట్లు శక్యము? నీవు చెప్పఁగలవా? యని యడిగిన నప్పడఁతి చిరునగవుతోఁ జెప్పవచ్చును. అదియొక గొప్పపని కాదని యుత్తరముఁ జెప్పినది.
ఆ సంవాదము విని యా యింటి యజమానురాలు అమ్మా ! నీవు సరస్వతివలె నుంటివి. అందుల కెద్దియేని యుపాయముఁ జెప్పితివేని నీకు మంచి పుణ్యము రాగలదు. ఆ మంత్రిభార్య యనసూయ వంటిది. నిత్యము వ్రతములని చెప్పి పేరంటాండ్రఁ బిలిచి దానధర్మము లూరక చేయుచుండును. ఆమెకు నాయందుఁ కడునక్కటికముఁ గలిగియున్నది. ఆమెను నీయొద్దకుఁ దీసికొని రానా? యని యడిగిన సరోజిని యేమియు మాటాడక ఘటదత్తువంకఁ జూచినది అతండు మందహాసమును గావించెను. ఆ మౌనమే యంగీకారమని తలంచి యా బ్రాహ్మణి వడివడి మంత్రిభార్య యొద్దకరిగి అమ్మా ! మాయింటికి నేఁ డొకచిన్నది వచ్చినది దాని మొగము చూడ రాచకుమార్తె వలె నున్నది. దానియన్నయు నద్భుత తేజంబునఁ బ్రకాశించుచుండెను. మాతో బ్రాహ్మణులమని చెప్పిరి. .మీకథ విని యావిధుంతుదవదన యదియొక గొప్పపని కాదని యాక్షేపించినది. తానవలీల నామ్రుచ్చెవ్వఁడో వాక్రుచ్చునట. నీ ఒకసారి యచ్చటికి రమ్ము. ఈ యాపద దాటఁగలదని తొందర పెట్టినది.
ఆ మాటవిని యాబోఁటి వెర్రిదానా ! ఆ చిన్నదిమాత్ర మెట్లుచెప్పగలదు. శకునముఁ జూడఁగలదా యేమి? ఇది యడుగవలసిన విషయమా? మాగ్రహచార దోషంబునఁ రాజునకట్టిబుద్ది పుట్టినదని కన్నీరుఁ గార్చుటయు నా బ్రాహ్మణి అమ్మా ! కాదు కాదు. ఆమె యెట్లో చెప్పగలదని నాకు దృఢవిశ్వాసము కలిగియున్నది. ఈ వితర్కము వారిలోవారి కక్కడనే జరిగినది అది యెంతపని యని యవ్వనిత చెప్పి