Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరోజిని కథ

211

అట్లు భయభక్తి విశ్వాసములలోఁ బరిచారకు లనుసరింప రాజు పుత్రుండా వేశ్యయింటికి వచ్చుటయు నది యెదురు వచ్చి హారతియిచ్చినది. ఆ పళ్ళెరమందు నూరుమాడలు కానుకగా నొకపరిజనుఁ డుంచుటయు నాభోగముది యాబూవికి వెరగు పడుచు లోనికిం దీసికొనిపోయి యుపచారములఁ బెక్కుఁ గావించి యా వయసుకాని దన కూతురున్న గదిలోనికిం ద్రోచి తలుపువై చినది.

పిమ్మట నారాజదూతలు నలువురు గృహవిశేషములం జూచుచుఁ జంద్రవతి యొద్దకుఁ బోయి యోహో ? భాగ్యశాలినీ ! నీ గేహము రాజభవనము కన్న విన్నాణముగా నున్నది గదా ? ఈ యలంకారములు మాకును విస్మయముఁ గలుగఁ జేయుచున్నవి ? అయ్యారే ? ఈ పటము కల్కేడ సంపాదించితివి ? ఈ మంచములు నీ మందసములు వెలఁ గట్ట నశక్యములని తోచ్చచున్నది మా రాజపుత్రుఁడు శిబికర్ణ దధీచులకన్న నీత నధికుండు సుమీ ? నీ యుపచారముల కానందించి గ్రామము లిచ్చుననితలంచు కొనుచున్నారమని యూరక పొగడుచుండుటయున ది యుబ్బుచు నిట్లనియె.

సుభగులారా ! నా యీ భవనాలంకారమునకే మెచ్చుకొనుచున్నారు. లోపలి విశేషములం జూచిన మరియుం గొనియాడుదురుగదా ? రండు చూడుఁడు అని లోపలికిఁ దీసికొనిపోయి గదుల తాళములు దీసి యంతర్భవనములు మేడలు రహస్యగృహములు లోనగు వింతలన్నియుం జూపుచు మీతోఁజెప్పకేమి ? మీ రాజనందనుడు తగిన సరసుఁడనియే నే నొడం బడితిని. సామాన్యుఁడు మావాకిలిఁ ద్రొక్కగలఁడా? ఎంత వాఁడు నా కిచ్చి మెప్పు వడయగలడో మీరే చెప్పుడు. పెక్కులేల ? ఈ పట్టణ రాజకుమారుఁడు వత్తునని వార్త నంపిన నాకూఁతు రంగీకరించినది కాదు. అని యాత్మస్తుతి పూర్వకముగా నుడివిన వారిట్లనిరి.

చంద్రవతీ ! నీ వింత చెప్పవలయునా ? యేమీ రాజపుత్రునితోఁ గూడ నిల్లు వెడలి యారునెలలైనది. పది నగరములు సూచితిమి విద్యాధనరూపంబులఁ బేరుపొందిన వారసుందరులఁ బెక్కండ్రఁ గాంచితిమి గాని నీ యైశ్వర్యముగల వెలయాలినిఁ జూచి యెరుఁగము. నీ వాడుక వెనుకటి నగరములయందే వినియుంటిమి. అందులకే వెదకికొనుచు ముందుగనే నీ మందిరమున కరుదెంచితిమ. ఇఁక నీ యిల్లు బంగారమైనదని తలంపుము. రేపీపాటికి మా యీవి విశేషములఁ దెలిసికొనఁగలవు. అని దానిమాట లందుకొని యూరక స్తుతిఁ జేయుచుండిరి‌.

అదియు వారిమాటల కలరుచుఁ దనయింటఁగల రహస్య విశేషము లన్నియుం జూపినది. వారు సూచి యానందించుచు నిఁక మేమువోయి పండుకొనియెదము. మా రాజపుత్రుండు వేకువజామున లేచును. కాచికొని యుండవలయునని పలుకుచు ముందరచావడిలోనికిం బోయి యాపరిచారకులు నలువురు బండుకొనిరి. ఆ రాజపుత్రుం డిట్లు గదిలోఁ బ్రవేశించి హంసతూలికాతల్పంబునఁ గూర్చుండి ఇట్లు ధ్యానించెను.