24
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
నృపసూనుండు నిలువంబడి గాయనీమణీ! వీణావతియను బిరుదము నీకచెల్లు. నావీణె నీవలె మేళగించి పాడినవారి నింతకుమున్ను జూచి యెఱుఁగ. నీగీతము మాకు మిక్కిలి యానందము గలుగఁజేసినది.
అని కొనియాడిన నచ్చేడియ చెలంగుచు లేచి యార్యా! నా గాంధర్వము మనోహరముగా నున్నదని మీరు కొనియాడుటంబట్టి నేను ధన్యురాలనని వేర చెప్ప నేల? అపూర్వవీణానిర్మాణదక్షులైనమీయక్షీణ ప్రభావంబు వేనోళ్ళం గొనియాడఁ దగియున్నదిగదా? నేను భూమండలమంతయుఁ దిరిగి చూచితినింగాని యిట్టివీణ నెందునుంజూచి యెఱుంగను. నావీణయే లోకాతీతమైనదని మెచ్చుకొనుదాన దానికన్న నిది మనోహరధ్వనుల వెలయింపుచున్నది. అని పెద్దగా నుపన్యసించినది
అట్టి సమయమున దానికంఠమునందలి రత్నమాలమణిప్రభలు బుష్పగుచ్ఛమువల మెఱయుచు నా సభాభవన మంతయుఁ గిమ్మీరకాయల నెఱయఁజేసి రాజపుత్రుని నేత్రములకు మిరుమిట్లు గొల్పినవి. అప్పు డతండు వెఱఁగుపడుచుండ నయ్యండజగమన పండితమండనా! ఎట్టి ప్రజ్ఞావంతుల కైనను సాధనములు మంచివి లేనిచో ప్రకాశము కలుగనేరదుగదా? ఏడంతరములనుండి మాయింటఁ బ్రఖ్యాతమై యున్న నా వీణ యీనడుమ భగ్నమైపోయినది. నాటంగోలె నాకేలిం గీలింపందగిన వల్లకి యెందునుం దొరకలే దనుటయు నారాజపుత్రుండు వెండియు నిట్లనియె.
బోటీ! నీవీణ యేమిటికి విరిగినది? నీ వెక్కడిదానవు? నీమెడలో మెఱయుచున్న రత్నహారము నీకెట్లువచ్చినది? నీవృత్తాంతము గొంత వినవలతుం జెప్పుదువేయని యడిగిన నప్పడఁతి వాని కిట్లనియె.
దేవా ! దేవర యీవృత్తాంత మడుగకపోయినను చెప్పఁదలచికొనియే యున్నదానను. వినుండు. మాకాపుర ముజ్జయినీపురంబు మొదటినుండియు మాకులములో సంగీతవిద్య యనపత్యమై యున్నది. విక్రమాదిత్యునికాలమందు హేమావతియను వేశ్యారత్న మన్ముహా రాజునకుఁ బ్రేమాస్పదయై యుండునది యఁట. సంగీత సాహిత్యములు రెండు ---------గనునకు సొమ్ములైయుండె ననుచు నిప్పటి కప్పట్టణ వాసులు చెప్పుకొనుచుందురు. విక్రమార్కచక్రవర్తి యొకప్పుడీ వీణ దేవలోకము నుండి తీసికొనివచ్చి వేశ్యాలలామము గానవిద్యకు మెచ్చికొనుచు కానుకగా దాని కిచ్చరట. ఆమె మాతల్లితల్లికి యమ్మమ్మ. ఈ వీణపై నత్యద్భుతగానము పాడి యా గానయనీమణి శాశ్వతకీర్తి సంపాదించినది. క్రమంబునం దరువాతివారును ------లనియే పిలువంబడుచుండిరి.
రాజపుత్రా! ఇఁక తమయెదుట దాచనేల? ఆవీణపై నేను చేసినసాధనము సరస్వతియైన చేయలేదని చెప్పగలను. దానంజేసియే వీణావతియను బిరుదము నాకొసంగిరి. నేను ప్రఖ్యాతికొఱకే దేశాటనముఁజేయుచుంటిని. గాని కేవలము ద్రవ్యముకొఱకుఁగాదు, చూచిన యాస్థానమునందెల్ల మంచిపేరే సంపాదించుకొంటిని.