Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(23)

వీరసేనుని కథ

177

పతులు సేనలతో వచ్చి యిరుదెగలవారిం బట్టుకొని యా బ్రాహ్మణులతోఁగూడ గుశధ్వజునొద్దకుఁ దీసికొనిపోయిరి.

కుశధ్వజుండు వారినెల్ల మందలించి యనిపి యా విప్రకుమారుల మువ్వురం జేరఁజీరి మీ రెవ్వరు ? ఏదేశము? ఈ దీవి కేమిటికి వచ్చితిరి? నిజముఁ జెప్పుడని యడిగిన శంతనుఁ డిట్లని‌యె. దేవా! మాది జంబూ ద్వీపము. మేము బ్రాహ్మణులము. నేను రాజ పురోహితుండను. వీ రిరువురు నింద్రజాలము పకారయప్రవేశవిద్యల నెక్కడనో యుపదేశముఁ బొంది మా వీఁడు వచ్చిరి. రాజపుత్రిక కపటముఁజేసి యా విద్యలు లాగికొని యిక్కడికిఁ బంపినది. వీరికి విహితుండని నన్నుఁగూడ దేశమునకుఁ బాపినది. తండ్రీ ! ఇదియే నిజము. నిరపరాధులమైన బ్రాహ్మణులకు బాథఁ గలుగజేసిన పాపమునకు ఫలం బనుభవింపక పోవదు. అని తమ కథయంతయు నెరింగించెను.

దయాహృదయుండగు నాదయితుండు వారి మొఱలువిని వెఱవకుడని యభయహస్త మిచ్చి వీరసేనుండను తన కుమారుని రప్పించి పుత్రా ! వీరి చరిత్రమును వింటివా కాంతి‌సేనయను రాజపుత్రిక పెండ్లి యాడెదనని చెప్పి వీరి‌ విద్యల లాగికొని శిక్షించినదఁట. ఇట్టి యన్యాయ మెందైనం గలదా ? బ్రహ్మాణుల హరించినఁ గులనాశనము కాదా ?‌ నీవు మహేంద్రజాల విద్యా పారంగతుండవు. కావున నీ కడ దాని మాయలు సాగవు. వీరిని వెంటఁ బెట్టుకొని పోయి యా రాచపట్టిని మందలించి వీరి విద్యల వీరి కిప్పింపుము అని యాజ్ఞాపించెను.

వారివలన వీరసేనుం డారాజకుమారి చారిత్రమంతయు విని యబ్బుచు నప్పుడే తగుపరివారముతోఁ బురివెడలి కరభ శరభ శంతనులు తన్నాశ్రయించుకొని రా నోడయెక్కి సముద్రముదాటి జంబూద్వీపముఁజేరి క్రమంబునఁ గొన్ని సమయములకు నానగర వరంబుఁ జేరెను.

మహేంద్రజాలవిద్యాపాటవంబున నా వీటికి రెండుయోజనములు దూరములో నోక యద్యానవనముఁ గల్పించుకొని అందు మహేంద్ర భవనవిభవ విరాజమానంబగు ప్రాసాదరాజంబున వసియించి యా రాజపుత్రుఁడు పట్టణమర్మంబులం దెలిసికొనిరండని గూఢముగాఁ గింకరుల నియమించెను. కరభ శరభ శంతనులు గడ్డములు పెంచికొని యోగులవలె నందుఁ గూర్చుండి జపముఁ జేసికొనుచుండిరి.

కాంతిసేన చారులవలన నా యుద్యానవన వృత్తాంతమునువిని వెరగుపడుచు నవ్విశేషములం దెలిసికొని రమ్మని కేసరణి నంపినది. ఆ పరిచారిక వినీతవేషముతోఁజని యవ్వనమంతయుం దిఱుగుచు నొకచోటఁ గరభ శరభ శంతనులంగాంచి గురుతుపట్టి యోహో ? మా పురోహితులు కాబోలు. సేమముగానున్నారా ? యని నమస్కరించినది. అప్పుడు శంతనుఁడు కన్నులెత్తి చూచుచు నోసీ ? మేము పురోహితులమో ? అహితులమో తెలిసికొందువుగానిలే. తొందరపడకుము. ఇది