Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము


ఎనుబదియవ మజిలీ

వీర సేనుని కథ

అయ్యో ? పురోహితుండనని యించుకయుఁ గనికరింపక నాకుఁ గూడ ద్వీపాంతరశిక్ష విధించినది. రాజపుత్రిక యెంత కఠినాత్మురాలు. అక్కటా ? ఇఁక నీ జన్మమునకు జన్మభూమిఁజూచు భాగ్యమునాకు లభింపదు కాబోలు. అన్నన్నా పెండ్లి యనిన నలంకరించుకొని పోయితినిగాని యీ యిక్కట్టుఁ దెలిసికొననైతిని. మా తల్లి తో నైన జెప్పుట కవకాశ మిచ్చినదికాదు. మా యుసురు‌ కాంతిసేన కెప్పుడు తగులునో ? యని శంతనుఁడు దుఃఖింపుచుండఁ గరభ శరభు లోదార్చుచు నిట్లనిరి.

శంతనా ! నీకేమి కొఱంత వచ్చినది. పంచాంగముఁ జెప్పుకొని యెక్కడ బ్రతుకలేక లేవు ? మా మాటఁజెప్పుము. అలోకసామాన్యములైన విద్యలు రెండును కోలుపోయి రెక్కలు విరిగిన పక్షులవలెఁ బడిపోయితిమి. ఆ విద్యలే మాచేతిలో నుండిన నీ ద్వీపముఁ బాలింపకపోవుదుమా ఇంతకును నీ వంతకు నంతఃకలహములు కారణములు పోనిమ్ము. బ్రాహ్మణులముగదా? ముష్టిఎత్తుకొని బ్రతుకుదముగాక. చింతించిఁ బ్రయోజనములేదు. అదీగో ? అల్లంతదూరములో నేదియో పల్లె కనంబడుచున్నది. పోవుదము పదుఁము. అని ధైర్యముఁ గరిపిరి.

మువ్వురును గలసి యా జనపదంబున కరిగిరి. అందున్న వారందరు గిరాతులుఁ వారి చర్యలు, కడు క్రూరములు. ఒకప్పుడు మనుష్యులనే తినుచుందురు. సముద్రములో వలలం బన్ని చేపలం బట్టి జీవింతురు. మిట్టమధ్యాహ్న మగుడు వీరు దాహ మిమ్మని యొకయింటికిం బోయి యడిగిరి. వీరిమాట లంతగాఁ దెలియకున్నన్ను సజ్ఞలవలన గ్రహించి యా యింటి యజమానురాలు పాలు తెచ్చి యిచ్చినది. వా రా దుగ్దంబులంగ్రోలి యాకలి యడంచుకొనిరి పిమ్మట‌ నాగేస్తురాలు వెలయిమ్మని యడిగినది. తనియొద్ద నేమియు లేకపోవుటచే దయా పూర్వకముగా విడువమని ప్రార్దించిరి. కాని యది‌ యనుమతించినది కాదు.

ఏదియో మిషఁ బన్ని వారొక్క రొక్కురుగా నవ్వలకు దాటిరి. అప్పుడు యింటి యజమానుఁడువచ్చి వారి వెదకి పట్టుకొని న్యాయసభకుఁ దీసికొనిపోయి వారి యపరాధ మెరింగించెను. అధికారి వారియొద్ద నేమియును లేకపోవుట విమర్శించి విడిచివేసెను. అది కారణముగా నా పల్లె లోని ప్రజలు రెండు తెగలై కలహింపఁ దొడంగిరి. ఆ కలహములు క్రమంబున యుద్దములై యొకరినొకరు చంపుకొన మొదలు పెట్టిరి.

ఆ సంగర వృత్తాంతముఁ దెలిసికొని యా కుళద్వీపాధిపతి కుళధ్వజుండు దండనాధులఁ బనిచి వారి నెల్లఁ బట్టి తీసికొని రమ్మని నియమించెను. ఆ సేనాధి