Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

వీణావతి యాభూషణంబుఁ దాల్చి వీణావిచ్చేదన సంజాతపరితాపంబు కొంత మరుగువడ నుబ్బుచు నబ్బింబోకవతుల యనుమతి వడసి గొబ్బున బస కరిగి యమ్మా! నావీణ తాను విఱిచియు నాకెట్టి పారితోషిక మిప్పించినదో చూచితివా? అని రత్నమాలఁ జూపుచు దావృత్తాంత మంతయుం జెప్పినది. లీలావతి యామె యౌదార్యము మిక్కిలి కొనియాడుచు నాటిరాత్రియే యొరు లెఱుంగకుండ పయనము సాగించి మఱియొకదేశంబున కరిగిరి.

వీణావతి ప్రసిద్ధిపడసిన గాయనీమణియగుట నా యా రాజధానులు కరిగి యందుగల వీణం బుచ్చుకొని పాడుచు కానుకల నందుచుండునది. తనకు సరిపడిన వీణ దొరకలేదను చింతమాత్రము విడిచినదికాదు.

ఆ వేశ్యాంగన లట్లు కొన్ని దినములు దేశాటనముచేసి యొకనాఁడు సాయంకాలమునకుఁ గాశీగుప్తమను పట్టణమునకరిగి యందొక సత్రంబున బసఁజేసిరి. ఆ సత్రము మిక్కిలి విశాలముగా నున్నది. నానావర్ణములవారును వేరువేర వండుకొనుటకును బండుకొనుటకును విహరించుటకుo దగిన గదు లనేకములు గలవు. అం దొక చిత్రశాలయున్నది. అది రాజకుటుంబంవారి చిత్రఫలకములచే నలంకరింపఁబడి నానాదేశ నిస్తులవస్తు విశేషములచే నొప్పుచు నెంతేని దర్శనీయమైనది.

మఱునాఁ డుదయంబునఁ గాలకృత్యంబుల నిర్వర్తించుకొని వీణావతియుఁ దల్లియు నాచిత్రశాల కరిగి యందుఁగల విశేషములన్నియుం జూచిరి. వారు పలు దేశములు తిరిగి చిత్రశాలలం బెక్కు చూచినవారగుట నందలివింతలు కొన్ని మాత్రమే వారికి సంతసము గలుగఁజేసినవి. ఒకచోట వీణ వాయించుచున్నట్లు వ్రాయఁబడిన యౌవనపురుషుని చిత్రఫలకముం జూచి విస్మయముఁ జెందుచు వీణావతి యందు నిలువంబడి సాతిశయముగా విమర్శించి అమ్మా! ఈ చిత్తరువుఁ జూచితివా? ఈ వీణ నా వీణవలెఁ బెద్దదిసుమీ: ఇట్టివీణ నాకు లభించిన మిక్కిలి యనుమోదింతునుగదా? ఇది చిత్రకారుఁడు వినోదముగా వ్రాసెనని తలంచెద. చూడుమనుటయు లీలావతి పరిశీలించి ఔను. ఇది చమత్కారముగా వ్రాసినదే. కానిచో వీణమాట యటుండనిమ్ము. ఇట్టి సుందరముగల పురుషుఁడు పుడమియం డెక్కడనైన నుండునా? ఇది కడు విచిత్రమని పలికినది.

పిమ్మట వీణావతి యందున్న రాజభటు నొకని నిర్దేశించి యీ చిత్రఫలక మెవ్వరు వ్రాసినదని యడిగినది. ఆ భటుం డిది మారాజుగారి నాల్గవకుమారుఁడు. సహదేవుని చిత్రఫలకము. ఎవ్వరు వ్రాసిరోనాకుఁ దెలియదని యుత్తరము చెప్పెను. ఆమాట విని యాబోటివెఱగుపాటుతో యా నీటుగానిం జూడవలయునని వేడుకపడుచు తల్లితో నమ్మా! నీవరిగి యారాజకుమారుని వృత్తాంతము సాంతముగాఁ దెలిసికొని రమ్ము. అతండు గానప్రియుండని దెల్లమగుచున్నది గానంబున వాని మెప్పించి యీవీణ గానుకగా నందుకొనియెదనని యప్పుడే తల్లిం బంపినది.