వీణావతి కథ
21
ఆకథవిని యా భూపతి యపరిమిత పరితాపము నొందుచు, పూఁబోణీ ! వీఱెలకేమి? పదివేలు సంపాదించుకొనవచ్చు నామచ్చకంటి చిత్తము మరలినదికాదు. ఎంతఁజెప్పినను వినదు వైరాగ్యముఁ జెంది యున్నది. అందులకే నిన్నక్కడి కంపినది. కార్యముదీరినదికాదు పోనిమ్ము. నీవీణకుందగినవెల నిప్పింతునులే! విచారింపకు మని పలుకుచు నా రాజు గుఱ్ఱమెక్కి యింటికిం జనియెను.
పిమ్మట వీణావతి తల్లితో నమ్మా! రాజుగారు మన వీణవంటివి యంగడిలో దొరుకుననుచున్నవారలు. దీని గుణదోషములువిమర్శింప వారికేమియవసరము? లక్షయిచ్చినను యిటువంటివీణ సంపాదింపగలమా? గ్రహచారముచాలక యీయూరు వచ్చితిమి. ఈ కానుకచాలును. మరియొక యూరికిం బోవుదము లెమ్ము. అని పలుకుచుండగా నొక పరిచారిక అరుదెంచి వాకిట నిలువఁబడి వీణావతీ ! అని పిలిచినది. ఆమాట విని లీలావతి వాకిటకువచ్చి నీ వెవ్వతెపు? అని యడిగిన నేను స్వయంప్రభాదేవిగారి పరిచారికను. ఆమె వీణావతినిఁ దీసికొని రమ్మని నన్నంపినది. అని పలకటయు, వీణావతి చాలుజాలు ఇంతకుజరిగిన శిక్షచాలదా? మరి యింక నేమి చేయంగలదు? అని ముదలకించిన నమ్మదవతి తరుణీ! నీపుణ్యము పండినదిఁ మారాచపట్టి నీవీణె విఱుఁగఁ గొట్టినందులకు మిక్కిలి పశ్చాత్తాపము చెందుచున్నది. నీకు మంచిపారితోషిక మీయఁగలదు. వడి రారమ్ము. అనుటయు తల్లి వెళ్ళుమని తొందరపెట్ట వీణావతి యాపరిచారికతోఁగూడ బండియెక్కి యుద్యానవన సౌధమున కరిగినది.
అప్పుడు స్వయంప్రభయు హేమయు నెద్దియో మాట్లాడికొనుచుండిరి. హేమ వీణావతింజూచి యాదరపూర్వకముగా యువతీ! కృద్ధుఁడు గురువునైనం జంపునను సామెత యున్నదిగదా! ఈ బాలిక తత్కాలంబునం బుట్టిన కోపంబున నీ వీణ విఱుగఁగొట్టినది. అందులకు జింతిల్లుచున్నది. దానిని నీవు ప్రాణపదముగాఁ జూచుకొనుచున్న దానవని వినిమరియుం బరితపించుచున్నది. దయాశీలురు కారణముచేఁ గ్రౌర్యమును పొందినను సహజగుణంబుల విడువరుగదా? పోయినవీణకు మేమేమియుం జేయఁజాలము, నీవు పెక్కుసభలకుం బోవుచుందువు. ఎక్కడనైనను మా రాజపుత్రిక యిట్టిదని వక్కాణింపకుసుమీ। ఆమె సుగుణములు నీకుఁ బూర్తిగాఁ తెలియకపోవుటచే నింత జెప్పవలసివచ్చినది. అని పలుకుచుండ స్వయంప్రభ చాలుజాఁలు నీ స్తోత్రములతోఁ బనిలేదు. ఊరకుండుమని మందలించుకుఁ దన మెడలోని రత్నహార మొకటితీసి హేమకిచ్చినది. హేమయుదాని బేఁటలు సవరించుచు వీణావతీ! ఇది యమూల్యమైనది. నీ జీవితములో నిట్టి పారితోషిక మందనేరవు. మా రాజపుత్రిక నీకుఁ జేసినమహోపకారమునకుఁగాను యావజ్జీవము సంతసించు నిమిత్తము మిది నీకిచ్చుచున్నది. మా పెద్దలకుఁ దెలియకుండ సత్వరముగా నీ యూరు విడిచి పొండు. అని పలుకుచు నా మణిహార మా నారీమణి మెడలో వైచినది.