174
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
మిత్రమా ! శాలివాహనా ! పల్కరించకయే నిలువం బడితివేల ? నాపైఁ గోపము వచ్చినదా యేమి? ఈ కరభు నెరుఁగుదురా యని నాక్షేపముగాఁ బలికిన వాఁ డిట్లనియె.
నేను గరభుని నిన్నును నెరుఁగుదును. నీవు చేసిన యపకారమును దెలయనివాఁడగాను. దైవానుగ్రహ ముండిన మనుష్యులేమి చేయఁగలరు. ఇఁక మూడు దివసము లరిగిన వెనుక నా మహిమ మీ రందరుఁ జూతురుగాక. నాకుఁ జేసిన యపకారములకుఁ బ్రతిఫలం బనుభవింతురుగాక యని మీసములు దువ్వుచు బెదరించిన విని కరభుఁడు శంతనా ! యిక మాకుఁ గుండలు దొరకవు సుమీ! కాచికొని యుండుమని పలికెను.
ఆ మాటలువిని యాజ్యమువోసిన యగ్నివోలె మండుచు వాఁడు శంతనా! ఘటము లిఁక నిందు నిలువవని చెప్పుము. నెవ్వడోఁ యెరుఁగక మాట్లాడుచున్నాడు. కారులు ప్రేలిన నోరు మూయింతి జుమీ! కాంతిసేన నా భార్య. ఉంకువయిచ్చి పెండ్లియాడ నిశ్చయించుకొంటినని పలుకగా నాకసంబంటుచుఁ గరభుం ఢిట్లనియె.
నే నామెచే వరింపఁబడిన భర్తను. నా యెదుట నేమంటివి? ఇంకొకసారి కాంతిసేన పేరెత్తినచో నీ నెత్తి రెండువ్రక్కలు చేయకుందునా ? కుమ్మర గురువా? నీ కులం బెరిగి మాట్లాడుమని పలికిన విని శంతనుండు, ఇంచుక యలుకఁ దోపఁ గరభా ! అప్పుడే కాంతిసేన నీకుమాత్రము భార్యయైనదా యేమి? నేను లేనప్పుడొకసారి యంతఃపురమున కరిగినంతనే స్వతంత్రుఁడవైతివి కాబోలు. నీ విషయమై కాంతిసేన యొప్పుకొనలేదు. నీ జాలము నాకీయ నక్కరలేదు. అని యేమేమో యుపన్యసించిన విని కరభుం డిట్లనియె.
మన కింత సంవాద మేమిటికి? కేసరిణి నడుగుము. అంతయు జెప్పఁగలదు. నా విద్య యిదివరకే యుంకువగా నిచ్చితిని. అసత్యముకాదు. నీతోడు. మంచి ముహూర్తము కొరకెదురు చూచుచున్నామని పలుకగా విని శాలివాహనుఁడు తన పరకాయ ప్రవేశవిద్యయు నుంకువగాఁ గైకొన్నదని చెప్పెను.
అప్పుడు మువ్వురు తగపులాడుచుఁ గేసరిణియొద్దకరిగి నేను కాంతిసేనకు భర్తనుగానా యని యడిగిరి. ఆ మాటలువిని యది నవ్వుచు మీ మువ్వురు రేపు సూర్యోదయ సమయమున కిచ్చటికిరండు మీ మువ్వురులో భర్త యెవ్వఁడొ చెప్పెదనని పలికినది.
అప్పుడుబోయి వారు మువ్వురు మరనాఁ డరుణోదయము కాకమున్న వచ్చి యందుఁ గూర్చుండిరి. కేసరిణి నిగళహస్తులైన నలువుర రాజభటులు నచ్చటికిఁ దీసికొనివచ్చి వీరే పెండ్లికొడుకులని వారిఁ జూపినది. అక్కింకరుల నిగళంబుల వారి పాదంబులకుఁ దగిలించుచు పదుడు పదుఁడు. మీకుఁ బెండ్లిఁ గావింతుమని పలుకుచు వారిని గెంటుకొనిపోయిరి. అప్పుడు కరభ శరభ శంతనులిట్లు విచారించిరి.