160
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
దొందరపడితినని పశ్చాత్తాపముఁ జెందుచుండెను. శరభుఁ డా యూరజూలముఁ బన్ని యనేకచిత్రములు చూపించి జనుల నాశ్చర్య వివశులం జేయుచుఁ జాల ధనము సంపాదించి సగము శరభునికిఁ బంచిపెట్టెను. శరభునికి మనోవ్యాధి బలియఁ జొచ్చినది అన్నన్నా ! ఈ జాలము చేతిలోనుండినచో నిత్యము వేలకొలదిఁ ధనము సంపాదింపవచ్చును. అతండు తెలియక మొదట నాకిచ్చెను. నేను మూర్ఖుడనై వచ్చిన లక్ష్మిని జేతులతోఁ ద్రోసివేసితిని. ఇప్పుడిమ్మని యడిగిన వాఁ డిచ్చునా ? అయినను గోరి చూచెదంగాక యని యాలోచించుకొని శరభుఁడు మెల్ల గా వానియొద్ద కరిగి మిత్రమా ! నీవు నాముద్దు జెల్లించుచు నే నడిగినంత రెండుసారులు విద్యల మార్చితివి. ఇఁక గడపటిమాటి నొకటి యడుగఁదలంచుకొంటిని. ఇదిగాక మరి యెన్నఁడును నేను గోరినను మార్చవద్దు. నా కింద్రజాలమునందు వేడుక తీరినదికాదు. దాని నిత్తువే? యని యడిగిన శరభుండు దీనికొరకింత మనవియేల ? నా కేదియైన నొకటియే. కావలసినం దీసికొమ్మని నిష్కపటముగా నుత్తరముఁ జెప్పెను.
అప్పుడు శరభునకు దురాలోచన కలిగి యట్ల యిన నీ విద్య తొలుత నాకిమ్ము. పిమ్మట నా విద్య నీకిచ్చెదను. ఇంతకుమున్ను రెండుతేపలు ముందు నేనే యిచ్చితినికదాయని పలికిన నతం డనుమానముఁ జెందుచు నీ మార్పులకు నీవే మూలము గనుక ముందు నీవే విద్య నీయవలయునని యుక్తిఁ జెప్పెను. అప్పుడు శరభఁడు నా విద్య నా కీయనిచో నే నేమి సేయవలయునో చెప్పుమని యడిగిన శరభుండు మూఁఢుఁడా ! నీకీబుద్ధి యెప్పుడు పుట్టినది. ఇదివరకు రెండుమారులు నట్లుచేసిన నేమిచేయుదువు ? నమ్మకముండిన నిమ్ము లేకున్న మానివేయుము. నా కేమియు నవసరములేదని చెప్పెను. ఇరువురకుఁ బెద్ద సంవాదము జరిగినది. అది పోట్లాట యైనది. అహంకారములు బలిసినవి. క్రమంబున మిత్రులిరువురు శత్రువులైరి. ఒండొరుల వంచించు కొనవలసిన యవకాశములు వెదకుచుండిరి.
కరభుఁడు వాని విడచిపోవయునని యెంత ప్రయత్నముచేసినను వదలక శరభుఁడు వెనువెంటనే తిరుగుచుండెను.
ఒకనాఁడొక మహారణ్యమున బడిపోవుచున్నప్పుడు శరభుఁడు జాల ప్రభావమున నొక పట్టణమును సృష్టించెను. అందనేకములైన మేడలును గృహములును రత్నమయములై విరాజిల్లుచున్నది. రాజమార్గములు మనోహర రధాశ్వాం దోహవస్తు విశేషములచే నిండియున్నవి. రాజభటులు సంభ్రమముతోఁ బరుగిడుచు అయ్యా ! మీ కేమైన వైద్యము తెలియునా ? మా రాజు ప్రాణంబులంవాయ సిద్ధముగా నున్నాడని యడుగుటయు శరభుఁడు మా కేమియుం వైద్యము తెలియదని చెప్పెను. శరభుఁడు కరభుని విడిచి సంతోషముతో వారివెంట రాజభవనమున కరిగెను. అప్పుడే