Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(21)

శంతనుని కథ

161

రాజు శరీరములోనుండి ప్రాణములు లేచిబోయినవి. ఇదియే సమయమని తలఁచి శరభుఁడు తన శరీర మెక్కడనో పారవేసి యా రాజశరీరములోఁ బ్రవేశించెను.

అప్పుడు కరభుఁడు వాని శరీరము వెదకి పట్టుకొని జుట్టునకుఁ ద్రాళ్లుగట్టి యొక చెట్టునకు దలక్రిందులుగా వ్రేలఁగట్టెను. అ జాల యొక దివసముకన్న నిలువదు కావున నా పట్టణ మంతలో మాయమైపోయినది. ఉపాది నశించినతోడనే శరభుఁడు నిలువలేక తన దేహము వెదకికొని దేహములోఁ బ్రవేశించి తలక్రిందుగా నుండుటకు వగచుచు నేల కురికి యది కరభుఁడు పన్నిన జాలమని తెలిసికొని తన యవమానమును గురించి దుఃఖించుచు నౌరా! యిది నిజమైన పట్టణమనియు నతఁడు రాజనియుఁ తలంచి మోసపోతిని అన్నన్నా ! ఇంద్రజాలము సత్యములాగే తోచును. అబ్బిన విద్యను గోలుపోయితిని. ఇఁక వీని వెనువెంట దిరుగరాదు. జాలము తెలియదు, నిజము తెలియదు. దూరముగాఁ బోయి యే మహారాజై నను మృతిబొందిన నతని శరీరముఁ బ్రవేశించెద నింతకన్న నాకు వేరొక తెరవులేదు. అని నిశ్చయించి వానికిఁ దెలియకుండ నఁట గదిలి మరియొక దేశమున కరిగెను.

కరభుండును దనజాలము జూడఁదగిన రాజధాని నరయు తలంపుతోఁ దిరుగుచుండెను.

అని యెరింగించి మణిసిద్దుం డవ్వలికథ నవ్వలి మజిలీయం దిట్లు చెప్పుచుండెను.

డెబ్బది ఎనిమిదవ మజిలీ

శంతనుని కథ

అయ్యారే ! ఈ పట్టణ రామణీయకం బెంత వింతగా నున్నది. ఇందలి భవనంబు లన్నియు నింద్రభవనములవలె మెరయుచున్నవిగదా ! దీనిం బృధ్వీ స్వర్గమని చెప్పనోపు. ఇట్టి పట్టణమునకును మన దేశమునకును నధి నాయకుఁడైన మహారాజు పూర్వజన్మంబుననెట్టి తపంబుఁ గావించి యుండునో? నే నుత్తమమైన పరకాయప్రవేశవిద్య శరభునకిచ్చి యీ పాడు నింద్రజాల విద్య గ్రహించితిని అందుఁ బొడకట్టు వినోదములన్నియు నొరులకేగాని నా కొక్కటియు గనంబడదు. అందుఁ జూపించు చిత్ర వస్తుజాలమెల్ల నెండమావులవంటివే ? క్షణభంగురములు దీనివలన సంపాదించిన విత్తము క్షణభంగురమే యగుచున్నది. ఈ రాజధానిలో నా విద్యా వైచిత్రముఁజూపి ‌ కొంతధనము సంపాదించెదగాక. అని తలంచుచుఁ గరభుం డొకనాఁడు ప్రాతఃకాలమున రత్నాకరమను నగరమున బ్రవేశించి వీధింబడి నడచుచుండెను.

పోవంబోవ నొకచోట నొక గృహద్వారముపై రాజపురోహితుని గృహమని