కరభశరభుల కథ
157
నేర్చుకొనుచున్నారు. శంకరుఁడు నన్ను మోసముఁ జేసెనని నిందించుచుండును. కావున నో భూసురుఁడా ? నీవా కౌశికునివలె మోసము పన్నుకొని వచ్చితివేమో యెవ్వఁ డెరుఁగును? మే మట్టి మాయలం జిక్కువారము కాము. నీ దారి నీవు పొమ్ము. మా పిల్లనీయము. అదియునుంగాక-
శ్లో. వర్ణం సితం శిరసి వీక్ష్య శిరోరుహాణాం
స్థానం జరాపరిభవిష్య తదా పుమాలనం
ఆరోపితాస్థిళకలం పరిహృత్య యాంతి
ఛండాలకూపమివ దూరతరం తరుణ్యః.
అని యెఱింగించువరకు వేళ యతిక్రమించినది తరువాత కథ తదనంతరావసంధంబున నిట్లని చెప్పం దొడంగెను.
డెబ్బది ఏడవ మజిలీ
కరభశరభుల కథ
శరభుడు :- కరభా ! నిన్న నా విదేశ బ్రాహ్మణునితోఁ దలుపు వైచికొని మన గరువుగా రెద్దియో ముచ్చటిందిరి. ఆ రహస్యముఁ దెలిసికొంటివా ?
కరభుఁడు :- వారు రహస్యముగా మాట్లాడికొన్న విషయము మన కెట్లు తెలియఁబడును ?
శరభుఁడు :- మనల దూరముగాఁ బొమ్మని నంత నేదియో వింత యుండక పోదని తలంచి రహస్యముగా నటుకపైఁ జేరి వీరి యేకాంతలాపము లాలకించితిని.
కరభుఁడు :- అందలి విశేషములేమి ?
శరభుఁడు :- ఆ బ్రాహ్మణుఁడు పెద్దకాలము తపముఁజేసి యింద్రజాలము పరకాయప్రవేశము అను విద్యలు రెండు సంపాదించి యంతలో దంతభగ్న మగుట నవి ప్రసాదింపమి సంతానాపేక్షఁ బెండ్లి యాడఁ దలంచి గురుపుత్రిక సావిత్రినిమ్మని యాచించెను.
కరభుఁడు :- అందులకుఁనొజ్జ లేమనిరి ?
శరభుడు :- కౌశికుఁడను బ్రాహ్మణునికథఁ జెప్పి నీవు మిగుల వృద్ధుండవు. నీకుఁ బిల్లనియ్యనని చెప్పిరి.
కరభుఁడు :- తరువాత తరువాత.
శరభుఁడు :- అతఁడు సిగ్గుపడి మరుమాటఁ బలుకక యిప్పుడే యీ యూరు విడిచి మరియొకయూరికిం బోయెను.
కరభుఁడు :- పోవుగాక మనకేమి.
శరభుఁడు :- మన మెన్నియేం డ్లేడిచినను రామశబ్దమైన తిన్నగారాదు.