158
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
మన బుద్ధులు బండబుద్ధులు. ఈ చదువు తుదముట్టినదికాదు. మనమా బ్రాహ్మణు నాశ్రయించి శుశ్రూషఁ జేసి యెట్లో యా విద్యల నుపదేశముఁ బొందితిమేని చాల ద్రవ్యము సంపాదింపఁగలము.
కరభుఁడు :- ఆ పారుఁడు మన కా విద్యల నేమిటి కిచ్చును?
శరభుఁడు :- ఇయ్యకేమి చేసికొనును. వానికిఁ బెండ్లి యీ జన్మమునకు గాదు.
కరభుఁడు :- అట్లయిన మంచిదే. కూడదిరిగి యాశ్రయింతము. ఆ రెంటిలో నొకదాని నిచ్చిననుం జాలు.
శరభుఁడు :- సీ! సీ! ఈ విద్యాగ్రహణభేద మెవ్వఁ డనుభవింపఁ గలడు. ఏపనికై నను నా మది ముందడుఁ గిడుచుండునుగాని చదువనిన శిరోభారము రాక మానదు.
కరభుఁడు :- అవును నాకును నట్లేవచ్చును.
శరభుఁడు :- అందులకే మన కిరువురకు జత కలిగినది. మఱియు గురువుగారి శుశ్రూష కడు కష్టముగా నున్నది. ఈ యేడు సావిత్రికి వివాహముఁ జేయఁగలఁడు. అప్పుడు మనచేత పశువులచేతం బోలె పనులు చేయించును. ఈ రేయిఁ జెప్పకుండఁ బారిపోయి యా కామగ్రీవుని గలసికొందము.
అని యిరువురు నాలోచించుకొని నాఁటిరేయి గృహము వెడలి కరభ శరభులను విద్యార్థు లిరువురు రెండుమూడు పయనములలోఁ గామగ్రీవుని గలసికొనిరి. గామగ్రీవుఁడు వారిం జూచి గురుతుపట్టి ఓహో! మీరు భట్టపాదుని శిష్యులుకారా? ఇక్కడి కేమిటికి వచ్చితిరి ? న న్నాయన తీసికొని రమ్మని పంపెనా యేమి అని తొందరగా నడిగిన వాండ్రు నవ్వుచు నిట్ల నిరి.
మహాత్మా ! నీవు వచ్చిన తరువాత భట్టపాదునకు భార్యకు నీ వివాహము విషయమై చాల వివాదము కలిగినది. ఆమె యొప్పుకొన్నదికాదు. మేముఁగూడ నిన్నుగురించి తగవులాడి విరోధుల మైతిమి. అందు నిలువక నీయొద్ధఁ జదువవలయునని లేచివచ్చితిమి. నీవు మాకు విద్యాదానముఁ గావింపుము. నీకుఁ బెండ్లి చేయు భారము మాది అని యదురు గరుపుటయు నతం డిట్ల నియె.
వత్సలారా! మీ యొద్ద దాచనేల ? నా కే విద్యయురాదు. నే నేమియుం జదువలేదు. మీరు మరియొకరియొద్దకుం బోయి చదువుకొనుడు అని పలుకుటయు వాండ్రు మరల నిట్లనిరి. ఆర్యా! మీరు మాకుఁ జదువు చెప్పకపోయినను సరే మీ వెనువెంటఁ దిరిగి మీకు రెండు మాసములలోఁ బెండ్లిచేయక తీరదు. మేమా గురుపత్నితో నట్లు శపథముఁజేసి బయలుదేరి వచ్చితిమి. చూడు మా సామర్ద్యమని పలికి యతని కెంతేని సంతోషముఁ గలుగఁజేసిరి. అతండు వారిని విద్యార్థులుగా నంగీకరించిరి వెంటఁ బెట్టుకొని త్రిప్పుచుండెను. మువ్వురు దేశాటననుఁ జేయు