18
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
అని చదివిన నీతిపద్యము జ్ఞాపకముండిన నట్లు చెప్పవుగదా! యని యాక్షేపించినది.
అంతటితో నాప్రసంగము ముగించి హేమ యితర క్రీడావిశేషంబులఁ గాలక్షేపముఁ గావించినది. అని యెఱిగించువఱకు వేళయతిక్రమించుటయు మణిసిద్ధుఁడు తదనంతరోదంతంబవ్వలి మజిలీ యందిట్లని చెప్పఁదొడంగెను.
ఏబది యెనిమిదవ మజిలీ.
వీణావతికథ
శా. వీణాదండమః నీకతంబునఁగదా విద్వాంసులెల్లన్ ననున్
వాణీతుల్య యటంచు నెల్లసభల న్వర్ణింతు రే నయ్యయో
ప్రాణంబుల్వలెఁ జూచికొందు నిను నీ పాలింటికి న్వచ్చె న
య్యేణీలోచన మృత్యువై యకటఁ నాకేదింక దిక్కె య్యెడన్.
హా ! వల్లవీరత్నమా ! తరతరంబులనుండి నీవు మాయింటగృహదేవతవలె బూజింపబడుచుంటివి గదా! నీకతంబునఁగాదె మావంగడము వారెల్ల సంగీతవిద్యా విశారదులని బిరుదములఁ బడసిరి. అయ్యో ! నేటితో నీఋుణము చెల్లి పోయినదియా? ఆహా! భవదీయ తంత్రీనాద మాధుర్య మెన్న నన్నారదాదులకు సక్యము కాకున్నది. నారదుని మహతికన్న నిన్నెక్కుడుదానిగ మురియుచుంటి. అంగుళీయస్పర్శ మాత్రంబున మొలచినట్లు నీయందు స్వరము లుత్పన్నములగుచుండు. అక్కటా! నిన్ను సతతము విడువకుండుటం బట్టియే నాకు వీణావతియని యభిఖ్య వచ్చినది. ఇప్పుడా పేరెట్లు చెల్లును? నీవంటి సాధనరత్న మీవంటివలతి మరియొకటి యున్నదియా? ఆ రాజపుత్రిక నిన్నుఁ ద్రొక్కక నన్ను గట్టిగఁగొట్టి విడచినను నింతచింత యుండకపోవునే? యని విఱిగిన యొక వీణ ముందిడుకొని వీణావతియను గాయనీమణి యొకతె గిరిదుర్గపట్టణంబున నొకయింటిలో విచారించుచుండెను.
అంతలో దానితల్లి లీలావతి యనునదివచ్చి యచ్చిగురుబోణితోపట్టీ! నీవు నిన్నటిరాత్రినుండియు నిట్లు చింతించుచుంటివి. దానం ప్రయోజనమేమి? ఇత్తెఱఁగంతయు రాజుగారి కెఱింగించితిని. ఆయన మిక్కిలి పరితపించుచు నిన్నో దార్చుట కిప్పు డిచ్చటికి వచ్చుచున్నాడు కన్నీరుఁ దుడిచికొనుము. అలకల ముడిచికొనుము. వారియెదురు రాజపుత్రిక నేమియు నిందింపకుము ఆమె వారికిఁ బ్రాణములలోఁ బ్రాణమయ్యె. ఇది మన గ్రహచారదోషమని నుడువుచుండగనే పుడమిఱేఁడు తత్తడి నెక్కి యొక్కరుఁడ యక్కడికివచ్చెను.