122
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
బాగుగాఁ బాడగలఁడుసుమీ ? నా కాయన చెంత సంగీతము నేర్పింపవా ? యని యడిగిన నవ్వుచు మేఘనాధుఁ డిట్ల నియె.
అమ్మా ! నీవు కడుముద్దరాలవు. నీ సంగతి యెరుఁగక నీ మగండు నిన్ను గురించి యీసుగాఁ జెప్పెను. నీకు సంగీతమిష్టమని నే నెరుఁగుదును? అది వినుటకై చావడియొద్దకువచ్చి నందుల కతం డనుమానముఁ జెందెను. సంగీతముఁ జెప్పించుట కంగీకరించునా ? యనుటయు తండ్రీ !ఇంతకుముందు మగవారిచేత నంగీతము నాకేలఁ జెప్పించితివి ? ఇప్పుడేల జెప్పింపరాదు. ఆ సంగతి నాకుఁ జెప్పుము. అని నిర్బంధించిన నతం డిట్లనియె.
పట్టీ ! నీకు స్త్రీ పురుష వివక్షయే తెలియదు. నిన్ను దూరినవారు నరకముఁ బొందరా ! ఇప్పుడు నీవు పెద్దదానవైతివి చెప్పుకొనరాదు. లోకవిరుద్దముగా నుండును. అని చెప్పుచు గూఁతురు వట్టి యమాయకురాలని మేఘనాధుఁడు తలంచెను.
తండ్రి తన మాటల నమ్మి వశుఁడగుట నతం డమాయకుఁ డని వినత తలంచినది. మించుబోణుల వంచనలం దెలిసికొన స్మృష్టించిన విరించికై న శక్యము కాదుగదా :-
అట్లు తండ్రి మందలించెనని గణియింపక యప్పంకజాక్షి చాంచల్యము విడచినది కాదు. వినత హృదయంబున మదనానలము ప్రజ్వరిల్లుచుండ దానిమగనికిఁ గోపానలము ప్రజ్వరిల్లఁ దొడంగినది. వినతభర్త రహస్యముగా భార్య కృత్యముల నరయుచు నొకనాఁ డొక పత్రికం దీసుకొనిబోయి మేఘనాధునికిఁ జూపుచు నిట్లనియె.
మామా ! నీ కూఁతు రేమియు నెరుంగనిదని నీ యభిప్రాయము ఇఁక దాచనేల? ఈ పద్యమువ్రాసి నీఁకూతురు కృతవర్మయున్న గదిలోనికి విసరినది. అతండది చూడలేదు. నేను చూచి దీని సంగ్రహించి తెచ్చితిని. ఈ పద్యమువిని నీ పుత్రిక ప్రౌఢయో ? ముగ్ధయో తెలిసికొనుము అని యా పద్యము నిట్లు చదివెను.
ఉ. ఓ నవచిత్త జన్మ ! భవదుత్త మరూపముఁ జూపి యేపునన్
సూనశరుండు నా మదిని సూటిగనాటగనేసెఁ చూపులన్
నే నెటులోర్చుదాన నిఁక నీ యధరామృత మిచ్చి నన్నుఁ బెం
పూనగఁ బ్రోవకున్న నయయో ? మృతియే శరణంబు నాకికన్.
ఆ పద్యమువిని మేఘనాధుం డించుక యాలోచించి యప్పుడు కూఁతునొద్ద కరిగి యా పద్దెముఁ జూపి దీని నెవ్వరు రచించరని యడిగిన సప్పడఁతి యదరక బెదరక తండ్రి కిట్లనియె. తండ్రీ ? నీ యల్లునికిఁ బట్టిన భూతము నిన్నుఁగూడ నావేశించినదా యేమి ? ఆతఁ డేమో చెప్పినంత నన్ను నిర్భందింప వచ్చితివి? నా యంకితము దీనిలో నున్నదియా యేమి? ఎవ్వరిచేతనో వ్రాయించికొని యా బుద్దిమంతుఁడు నీకుఁ జూపెను. అది సత్యమనుకొని నన్నడుగ వచ్చితివి. చాలు