Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శబరదంపతుల కథ

123

జాలు. నీ యల్లుని గుణమెరుంగని వాడుంబోలె గోఁడుబూనితివి కృతవర్మ శకుని కన్న నధికుండు‌ జుమా! మనయింట భుక్తికి నిలిచెదనని మీరేమో యనుకొనుచున్నారు. అని కృతవర్మను బొగడుచు మగని నిందింప దొడంగినది. -

మేఘనాధుఁడు వినత చెప్పిన యుపన్యాసము మంతయు సత్యమని నమ్మి యల్లునియొద్దకుఁబోయి తన పుత్రిక కడు నుత్తమురాలని పొగడుచు నతనిం దద్దయుం బూరి పారఁగొట్టెను.

అంతలోఁ బ్రయాణ ముహూర్తము సమీపించుటయు మేఘనాధుండు నాటకోపకరణములన్నియు శకటంబులపై నెక్కించి కుటుంబ పరివార సహితముగా బయలుదేరి దేశాటనముఁ జేయుచు గొప్పపట్టణముల నిలిచి నాటకప్రదర్శనములఁ గావింపుచుఁ బారితోషికములందుచుఁ గొంతకాల మీరీతి దేశములఁ జరియించి కాశీపురంబున కరిగెను.

అని యెరింగించి పిమ్మట నగు వృత్తాంత మక్కథకుండు అవ్వలి మజిలీయందుఁ జెప్పఁబూనెను.

డెబ్బది నాలుగవ మజిలీ కథ

శబరదంపతులకథ

తారావళీ ! చిదంబరయోగి వట్టి జారుఁడట, మంత్రోపదేశ కై వతంబున నా బాలయోగినిని జేరదీసెనఁ టయ్యారే ? ఎంతవంత ఆతఁ డిచ్చిన మంత్రభస్మము మనకేమి ప్రయోజనము ? నిన్నుఁజూడక యాతం డింత యుపేక్షించుచున్నాడు. నేడు చక్కగానలంకరించుకొనుము. వానియొద్దకుఁ దీసికొనిపోయి యడిగెద నని కిన్నరదత్తుని భార్య యొకనాఁడు తారావళితో ముచ్చటించిన నమ్మచ్చకంటియు నందుల కనుమోదించి దివ్యమణి భూషాంబర మాల్యాను లేపనాదులచే సింగారించుకొని మేనత్తతోఁగూడ శశాంకునొద్ద కరిగినది.

శశాంకుఁడు వారిరాక పరిజనులవలనం దెలిసికొని యెదురువోయి తల్లికి నమస్కరించుచుఁ దోడ్తెచ్చి యుచితపీఠంబునం గూర్చుండఁ బెట్టెను. తారావళి మేనత్త గద్ధియనాని వెనుక నిలువంబడినది. అప్పుడు రాజపత్ని వత్సా ! శశాంకా ! నీ వీ దేశపుఁబ్రజలపుణ్యంబున రాజువైతివి. మీతండ్రియుఁ గృతకృత్యుడయ్యెను. నీ సుగుణంబులు లోకులు కొనియాడుచుండ విని యానందించుచుంటిమి‌ అన్నిటం బ్రియకరుండ వైతివి. విను మిప్పుడు నీవు యౌవనవంతుండ వగుటఁ బెండ్లి యాడ‌ వలసి యున్నది. అప్పని యుపేక్షించుచుంటివి. అందులకుఁ దొలతనే మీతండ్రి నిశ్చయించియున్నారుగదా ? వారు చెప్పిన తారావళి నీ మేనమామ కూతు రిదియె. మంచి గుణవంతురాలు. సంతతము నీ గోష్టియే చేయుచుండును.