Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

జాలక పరితపించుచుండెను. మమ్మెల్లఁ బరిభవించి యా రాచపట్టి ముష్టిభాపనయ్యం జేపట్టె. ముందు వానిపని పట్టవలయునని తలంచుకొని రాజపుత్రు లందరు నేకమై మావీఁడు ముట్టడించిరి.

అప్పుడు ప్రభాసాగరుం డొక్కరుండు పెక్కండ్రతోఁ బోరఁ వెరచుఁ గిన్నరదత్తుం డత్యంతమిత్రుండగుట నతని పుత్రున కీవార్త దెలియఁ జేసెను. అమ్మహారాజు మిమ్ముఁ బంపుచున్నారుగదా ఇదియే యచ్చటి కథయని చెప్పిన విని సత్వవంతుడుఁ తొందరపడుచు నప్పుడే తన బలమునెల్లఁ బయనము సేయించి వేగముగా నడిపించుచుండెను. అంతలో మరికొందరు సాహిణు లెదురువచ్చి సత్వవంతునకు నమస్కరింపుచు దేవా ! శత్రురాజపుత్రులు ప్రభాసాగరు నోడించి సభాంధపముగాఁ గారాకారంబునఁ బెట్టించిరి. కోట యాక్రమించి వస్తువాహనములఁ గొల్ల గొట్టుచున్నారు.తరువాతకృత్యమునకు దేవరయే ప్రమాణము. పౌరులెల్ల నీదిక్కునే చూచుచున్నారని చెప్పుటయుఁ బరితాపముఁ జెందుచు సత్వవంతుఁడు సేనల నతిక్రమించి తురగమెక్కి యా రౌతులతోఁ గూడ రెండు గడియలలో సౌగంధికనగరము ప్రవేశించి యడ్డము వచ్చిన వారినెల్లఁ బరిభవించుచు నిరాఘాటముగాఁ గోటలోఁ బ్రవేశించి రాజ్యవిభాగా యత్త చిత్తులైయున్న రాజపుత్రుల నందరఁ జూచి కొందరు జంపియుఁ గొందరఁ బారఁదోలియుఁ గొందరం గొట్టియు గొందరఁ బట్టియు నీరీతి నర్థదివసంబులో శత్రువులనెల్ల జయించి ప్రభాసాగరుని బంధువులతోఁ గూడ విముక్తునం గావించి సింహాసనాసీనుం గావించెను.

ఇంతలో బలము లా నగరములోఁ బ్రవేశించినవి. విజయనాదంబులు పట్టణమెల్ల వ్యాపించినవి. పౌరులు సత్వవంతుల బార్దుండని వినుతింపం దొడగిరి. అప్పుడు ప్రభాసాగరుఁడు సత్వవంతుం గౌగలించుకొనుచు మహాత్మా! నీవు మా కిన్నరదత్తున కెట్టిబంధుండవో తెలియదు. నా పాలిటికి దైవమునైతివి. నీ కులశీల నామంబు లెరింగించి శ్రోత్రపర్వముఁ గావింపుము. ఇది మొదలులు నా యర్ధరాజ్యంబు నీవు పాలింపుము. రాజ్యప్రాణదాతవైన నీ కేమిచ్చినను ఋణవిముక్తుఁడ కానని కృతజ్ఞతాపూర్వకముగాఁ బ్రార్థించిన విని సత్వవంతుం డిట్లనియె. నరేంద్రా! నేను కిన్నరదత్తుని పుత్రునకు మిత్రుఁడు. నాపేరు సత్వవంతుఁడందురు. మిత్రచోదితుండనై మీ కార్యంబుఁ జక్క చేసిన నన్నింత యుగ్గింపవలయునా? విధికృతంబులు స్తుతి పాత్రములుకావు. నేవచ్చినపని తీరినది. నాకు మీరాజ్యముతోఁ బనిలేదు. పోయివత్తు నానతీయుఁడని పలికిన నన్న రేంద్రుం డిట్లనియె.

మహాత్మా ! యుత్తము లసమానకృత్యములు నిర్వహించియు స్వాధిక్యతను బ్రకటించుకొనరు. నీవు మాకును మా ప్రజకును జేసిన యుపకార మితన్మాత్రంబుగాదు. నీవు డెదసముడవు. కానిచో నొక్కరుఁడవు పెక్కండ్రం గీటడగించగలవా ? భవదీయ విజయాభినందనమునకై యెల్లుండి యొకసభఁ జేయఁబోవుచున్నారము.