పుట:కాశీమజిలీకథలు-05.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

105

బోగా జెవిలో నెద్దియో చెప్పువాడుంబోలె నూది మో మాఘ్రాణింపుచు జడ గైకొని యధరరస మానెనఁట. అయ్యర్ధం బాయువతి సఖితో జెప్పుచుండ నట్లిందు వ్రాసె నెంత చతురుడో చూడుము.

హేమ — అక్కా? యీ శ్లోకములన్నియు నాకు జెప్పెదవా? అర్ధముతో వర్ణించి మన సఖురాండ్రనెల్ల వెరపించుచుందును.

మంజు — అలాగే కాని యిప్పుడు దీరికలేదు. ఱేపు చెప్పెద బోయి వత్తునా?

వసంతకళిక - డెబ్బదినాలుగ శ్లోకము చదివి పిమ్మట బొమ్ము. అది పైకి తీసితివి గదా.

మంజు - సరియే యెంతసేపు నిలువను ? సంగీతశాల కరుగవలయు నుపాధ్యాయుండు వచ్చి వేచియుండునేమో ?

వసంత — అది యొక్కటియే కాదా చదివిపొమ్ము.

మంజు —

శ్లో॥ శూన్యంవాసగృహంవిలోక్యశయనాదుత్థాయకించిచ్చనైః
   నిద్రావ్యాజముపాగతస్యసుచిరంనిర్వర్ణ పత్యుర్ముఖం
   విస్రబ్దంపరిరభ్యజాతపులకామాలోక్యగండస్థలీం
   లజ్ఞానమ్రముఖీప్రియే హసతాబాలాచిరంచుంబితా.

హేమ - అర్ధము చెప్పి కదలుము.

మంజు — ప్రియుం డేకాంతగృహంబున నొక్కరుడు శయనించి యుండ విద్రుమోష్ఠి మెల్లగా లోనికిబోయి కపటనిద్ర బోవుచున్న యతిని మొగము సోయగము వర్ణించుచు నువ్విళూర ముద్దిడుకొనబోయి యందు బులకలు పుట్ట జూచి సిగ్గుపడి తలవంచుకొనుచు, దిగ్గున లేచి యతం డాబాలను చుంబించెను. ఇదియే దీని యర్దము.

హేమ — విద్రుమోష్ఠి యనురాగము వెల్లడిచేయును.

మంజు — ప్రియుం డీశ్లోకము చక్కగా రచించెను. నే నిక నిలువరాదు. పోయివత్తు. సంగీతశాల నాచార్యుండు వేచియుండుంగదా.

హేమ — పోనీ పుస్తక మిచ్చి పొమ్ము. మేము చదువుకొనుచుందుము.

మంజు - ఆలాగునే యని పుస్తక మిచ్చి నిష్క్రమించినది. పిమ్మట తక్కిన యువతులు నా పుస్తకము చదువుకొన మరియొకచోటికిం బోయిరి.

అని యెరింగించి మణిసిద్ధుం డప్పటికి కాలాతీతమగుటయు దదనంతరోదంత మవ్వలిమజిలీయం దిటుల చెప్పదొడంగెను.