పుట:కాశీమజిలీకథలు-05.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

కాశీమజిలీకథలు - ఐదవభాగము

నుప్పతిల్లిన సంతసముతో నృపాలుండు బ్రతికె బ్రతికెనని పెద్దయెలుంగున నరచుచు నరుణోదయంబున సారసపతంగముఖరితములగు పద్మినులువోలెఁ బ్రకాశించిరి.

తదీయసంతోషనినాదంబు లాలించి యాప్రాంతమందు విచారింపుచున్న యతని మంత్రులు సజీవితుండగు భూపతిని గాంచి ప్రహర్షసమంచితాంతరంగులై పటహభేరీశంఖాదినినాదంబులు భూనభోంతరాళంబులు నిండ వెలయింపజేసిరి.

సీ. మన యదృష్టంబు నేమనవచ్చు జమువీడు
           గని వచ్చె తిరుగ నీ ఘనుఁడటంచు
    మనపుణ్యమే కాక మరల జీవించునే
           చితిఁ జేర్చినట్టి భూపతియటంచు
    మనపురాకృతతపంబునఁ గాక మనునునోకో
           ప్రేతత్వ మొందిన నేతయనుచు
    మనదానధర్మసంపత్ఫలంబునఁగాక
           యిటు చచ్చి బ్రతుకునే యినుఁడటంచు.

గీ. భార్యలును మంత్రులును హితుల్ ప్రజలు మురిసి
   రందు నిద్రించి మేల్కొని నట్టివాని
   పగిది లేచిన యజ్జనపాలముఖ్యుఁ
   గాంచి సంతోషభూరిసాగరతరంగ
   డోలికల నూగి రొక్కింతకాల మపుడు.

పిమ్మట నమ్మనుజపతిని హితపురోహితమంత్రి ప్రముఖులు శాంతికర్మపూర్వకముగా మాంగళ్యకృత్యంబులు నిర్వర్తించి భద్రదంతావళ మెక్కించి తూర్యధ్వనులతో నూరేగింపుచుఁ బౌరు లత్యద్భుతాహ్లాదమేదురహృదయములతో విలోకింపుచు సేసలు జల్లుచుండ గ్రమంబున రాజమందిరముఁ బ్రవేశపెట్టిరి.

అబ్భూపాలదేహముతోనున్న శంకరుండు ప్రజల నెరుంగకున్నను తత్సమయోచితముగా వారి వారికిం దగినట్లు ప్రత్యుత్తరము లిచ్చుచు నాదరింపుచు సత్కరింపుచుఁ దనవైపరీత్యము దెలియకుండ మెలంగుచు సింహాసన మెక్కి న్యాయంబునఁ బ్రజలఁ బాలింపుచుండెను.

అట్టి సమయంబున బుద్ధిమంతులగు తన్మంత్రిపుంగవు లొకనాఁడు రహస్యముగా నిట్లు సంభాషించుకొనిరి.

ప్రథముఁడు — మిత్రులారా! మన ధాత్రీపతి మృతుండై బ్రతికిన తరువాతఁ బూర్వమువలెఁగాక యపూర్వతేజోమహత్త్వంబునఁ బ్రకాశింపుచున్నవాఁడు చూచితిరా?