పుట:కాశీమజిలీకథలు-05.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

కాశీమజిలీకథలు - ఐదవభాగము

పోయి తద్వృత్తాంతముఁ దెలిసికొని స్త్రీలోలుండై యున్నవాఁడు కావున నల్లనఁ దదంతఃపురకాంతల నాశ్రయించి నృత్యంబులఁ గఱపుచు వారి కాంతరంగికుండై మెలంగుచుండెను. ఇట్లుండ నొకనాఁ డయ్యోగి తత్త్వవేత్తయగుటఁ బూర్వస్మృతి గలిగి నివృత్తరాగుఁడై తన స్థితికి వగచుచున్న నెఱింగి గోరక్షుఁడు సమీపించి యోగప్రవృత్తి పూర్వకముగాఁ దనవృత్తాంతమంతయు నతని కెఱింగించి క్రమ్మఱ నాత్మీయకాయంబునం బ్రవేశింపఁజేసెను.

అయ్యారే! విషయానురాగ మటువంటిదిగదా? యూర్ధ్వరేతోవ్రతఖండనంబునం బాపంబు గలుగునండ్రు. ఈ కృత్యంబు పుణ్యమో పాపమో వివేచింప నీవే సమర్థుండవు. నిరుపమానములగు మన నియంబు లెక్కడ! నతిగర్హితమగు కామశాస్త్ర మెక్కడ? మీరే యీ పని కవలంబించితిరేని నిఁక జగంబున నీమంబు వహించువా రెవ్వరు. పృథివియందు శిథిలమగు యతిధర్మమును నిలుపఁ గంకణము గట్టికొనిన నీకుఁ దెలియనిది యేమి యున్నది? యైనను నీ యందుఁ గల పరిచయంబున నింత చెప్పితి, నా తప్పు మన్నింపుమని పలికెను.

వత్సా! నీవు సత్యమే పలికితివి. విషయప్రవృత్తి యట్టిదే కాని పరమార్ధ మొక్కటి చెప్పెద నాలకింపుము. అసంగునకుఁ గామంబు లెన్నఁడును జనింపవు. దీనికిఁ గృష్ణుడే నిదర్శనము. మరియు నఖిలకామములకు మూలమైనది సంకల్పము. అట్టి సంకల్పము కృష్ణతుల్యుఁడనగు నాకు లేదు గదా! సంసారదోషములం జూచు కర్తకు సంకల్పహాని యగుచుండఁగా భవనాశన మగుచుండు. ఎవ్వఁడు శరీరాదికమును విచారింపక ధృఢముగా నే నని తలంచునో యట్టి మూఢుని విషయమై విధినిషేధశాస్త్రము సఫలమగుచున్నది. మహావాక్యములచేఁ గృతకృత్యమైన బుద్ధిగల ప్రాజ్ఞుండు వర్ణాశ్రమజాతిశూన్యమగు పరతత్త్వముఁ దన్నుఁగా నెన్నుకొనుచు శ్రుతిశిఖరంబు నధిష్టించియు విధినిషేధశాస్త్రమునకుఁ గింకరత్వము చేయునా?

శ్లో॥ తదయంకరోతుహయమేధశతా
     న్యమితాని విప్రహననాన్యథవా
     పరమార్థ విన్న సుకృతై ర్దురితై
     రపిలిప్యతేస్తమిత కర్తృతయా.

తత్త్వవేది కర్తృత్వభోక్తృతాది శూన్యుండగుటచే హయమేధశతంబు నాచరించుఁగాక యనేక విప్రహత్యలు గావించుఁగాక తత్సుకృతదుష్కృతముల నంటఁడు సుమీ. ఇంద్రుండు తొల్లి త్వష్ట కొడుకుగు విశ్వరూపుం బరిమార్చెను. కుపితుండై నరున్ముఖయతుల బెక్కండ్ర సాలావృకముల కప్పగించె. దత్కర్మ వలన నతనికి లోమహానియైనం గలిగెనా? యని ఋగ్వేదము చెప్పలేదా?