పుట:కాశీమజిలీకథలు-05.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

93

వెళ్ళించెను. అమ్మరునాఁడుదయకాలంబున శంకరయతి శిష్యులతోఁగూడ యోగ మవధరించి గగనమార్గంబున నరుగుచు నొకచో నరణ్యమధ్యంబున రాత్రి వేటకై వచ్చి మూర్ఛామయగ్రస్తుండై తరుమూలంబున గతాంసుడైనను స్వర్గబ్రష్టుండైన యమర్త్యుండువోలె నొప్పు నమరకుండను నృపాలుండు పడియుండుటయు నతని భార్యలు నూర్వు రార్తనినాదములతో వచ్చి చుట్టునుం బరివేష్టించి పెద్ద యెలుంగున నరణ్యము ప్రతిధ్వను లీయ నేడ్చుచుండుటయుం జూచి శంకరుండు సనందనుని కిట్లనియె. సనందనా! యిం దమరకుండను నృపాలుండు గతాంసుండై బడియున్నవాఁడు చూచితే! యితని భార్యలు సౌందర్యసౌభాగ్యమనోజ్ఞులై యున్నవారు. పాప మీయువతులు పతివియోగచింతాసంతాపముతో నెట్లు చింతించుచున్నారో చూడుము. వీడు హఠాన్మరణము నొందుటచే వీరికి శోకమిబ్బడించు చున్నది. నేను వీనిదేహమునఁ బ్రవేశించి యిమ్మించుబోణులఁశోకము కొంత యుపశమింపంజేసి వీని పుత్త్రుని భట్టభద్రునిం జేసి మఱల స్వకాయమునం బ్రవేశింతును.

అదియునుంగాక యుభయభారతి ప్రశ్నముల కుత్తరముఁ జెప్పి సర్వజ్ఞత్వము నిలువుకొనవలయుంగదా. యీ మించుబోణులవలన గిలికించితాది లక్షణంబులును గళావిశేషంబులం దెలిసికొని కార్యనిర్వాహకత్వము గావించెదను. అని పలికిన విని పద్మపాదుం డీషత్స్మితశోభితవదనారవిందుండై యల్లన నిట్లనియె స్వామీ! నే మీమాట కాదనుటకెంతవాఁడ. సర్వజ్ఞులైన మీ యెరుంగనిది కలదా? యైనను భక్తి నన్ను వాచాలునిఁగాఁ జేయుచున్నది. పూర్వము నుత్సేంద్రుఁడను మహాత్ముం డొకచో మృత్యుండైనమహారాజు శరీరముఁ జూచి గోరక్షుండను తన శిష్యుని స్వకళేబరముం గాపాడ నియమించి తా నానృపశరీరములో బ్రవేశించి యారాజ్య మేలుచుండెను. ఆ మౌనిసింహుండు సింహాసన మెక్కినది మొదలు తద్దేశము తృణకాష్ఠజలసమృద్ధి గలిగి సస్యానుకూలముగా వర్షములు గురియుచుండఁ జక్కగా ఫలింపఁదొడంగినది. తదీయమంత్రు లానృపవరుని యపూర్వతేజఃపటలమునకు వెరిఁగందుచు నోహో? యిం దెవ్వఁడో పరకాయప్రవేశవిద్యానిపుణుండైన యోగి ప్రవేశించినాఁడు కాబోలు. కానిచోఁ జచ్చినవాఁ డెందైనం బ్రతుకునా? యతండు తిరుగ స్వకాయమును బ్రవేశింపకుండ వీని నిందు నిలుపవలయునని తలంచి రూపయౌవనకళావిలాసములచే నభిరామలై యున్న రామలఁ బెక్కండ్ర నతనిసేవకు నియోగించిరి. తదీయహావభావాది విలాసములకుఁ జిక్కి యయ్యోగి సమాధి వృత్తమఱచి తదీయసంగీతనృత్యాది వినోదముల బద్ధాదరుండై స్మరలీలాసమాకర్షితస్వాంతుండై ప్రాకృతుండువోలెఁ బూర్వకృతం బంతయు మఱచిపోయెను.

గోరక్షుం డెంతకాలమునకు దనగురుండు స్వశరీరమునఁ బ్రవేశింపకునికి విచారించి తద్దేహము మఱియొక విధంబున నిగూఢముఁ జేసి గురు నన్వేషింపుచుఁ బోయి