పుట:కాశీమజిలీకథలు-05.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

కాశీమజిలీకథలు - ఐదవభాగము


శంకర సరస్వతుల సంవాదము

పిమ్మట నా సభయందు శంకరసరస్వతులు పరస్పరవిజయోత్సుకత్యము మీర మతిచాతుర్యంబునం బ్రయోగింపబడిన శబ్దప్రవాహములచే విద్వాంసులకు విస్మయము గలుగజేయుచు నద్భుతముగాఁ బ్రసంగముఁ జేయందొడంగిరి. విచిత్రపదయుక్తిప్రయుక్తులచే వ్యాప్తమైయున్న తత్ప్రసంగవాగ్ధోరణి నాలించి సభ్యులు గురుకవిఫణీశభాస్కరాదులఁ దిరస్కరింపుచు మెచ్చుకొనఁదొడంగిరి. వారిరువురు సంధ్యావందనాదుల నియతకాలంబుల విడిచి యహోరాత్రంబు లేకరీతి వాదింపుచుండఁ బదియేడు దివసంబులు గతించినవి. అ ట్లవ్వాగ్దేవి పదియేడుదినము లఖిలశాస్త్రములయందును శంకరునితోఁ బ్రసంగించి చూచి దేనిలో నతని జయించునుపాయముం గానక యీతండు బాల్యంబుననే సన్యసించి యుత్కృష్టములైన నియమములచే దీపించుచున్నవాఁడు. కావున మదనశాస్త్రమం దితనికిఁ బ్రవేశము కలిగియుండదు. కావున దానియం దడిగి యీతని నోడింపవలయు నింతకన్న వేఱొకసాధనము లేదని నిశ్చయించి యవ్విరించి మించిబోణి యిట్లనియె.

శ్లో. కళాఃకియంత్యో వదపుష్పధన్వః
    కిమాత్మికాఃకించ పదంసమాశ్రితాః
    పూర్వేచపక్షెకథ మన్వథాస్థితిః
    కథం యువత్యాం కథ మేవపూరుషే

సంయమీంద్రా! మన్మథకళ లెన్ని? యవి యే స్వరూపమున నొప్పునవి? వానిస్థానము లెయ్యవి? అవి శుక్లకృష్ణపక్షములయం దెట్టివ్యత్యాసమును జెందును? పురుషునియం దెట్లుండును? స్త్రీలయం దెట్లుండు వక్కాణింపుమని యడిగెను. అయ్యతిసత్తముఁ డత్తరుణివచనములకుఁ బ్రత్యుత్తర మీయక యోహో! యీమె కామశాస్త్రములోఁ బ్రశ్నఁ జేసినది. ఉత్తర మీకున్న నల్పజ్ఞత్వదోషము వచ్చును. చెప్పినచో ధర్మలోపము వచ్చును. ఏమి చేయుదును. అని యొక్కింతసేపు చింతించి తదర్థములన్నియు లెస్సగా నెరిఁగినవాఁడయ్యును యతుల నియమము గాపాడుతలంపుతోఁ గామశాస్త్ర మెరుంగనివాడుంబోలె నిట్లనియె.

సాధ్వీ! నా కొకమాస మవధి నీయదగు మాసాంతరమున నీ మాటల కుత్తరము జెప్పువాఁడ. మదీయమదనశాస్త్రప్రవీణత యప్పుడు జూచెదవుగాక అట్లు గడు విచ్చుట వాదిధర్మమై యున్నదని గడు వడిగిన విని యప్పు డయ్యింతియు నందుల కొడఁబడియెను. అంతటితో నాసభ ముగింపఁబడినది. కావున వారి యనుమతి వడసి శంకరయతి సనందనాది శిష్యులతోఁ గూడ నచ్చట వెడలి నర్మదానదీతీరంబున నున్న యుద్యానవనములోఁ బ్రవేశించి యా రేయి సంవాదగోష్ఠీవిశేషకథాలాపములచేఁ ద్రుటిగా