పుట:కాశీమజిలీకథలు-05.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

91

స్థితియంతయు వక్కాణింపుడు. భవాదృశులు ప్రణతజనులయెడఁ గనికరముఁ జేసి గోప్యమైనను వక్కాణింతురుగదా. అని భయభక్తివిశ్వాసములతోఁ బ్రార్థించినది. అమ్మహాత్ముం డొక్కింతసేపు కన్నులు మూసి ధ్యానించి యంతయుం గనికరముతో నోహో! యువతీ! భవదీయపుత్త్రికారత్నము నిరవద్యసౌఖ్యంబుల నందఁగలదు. వేదమార్గము బాహ్యమతములచే నావృతము గాఁగ దానిం జక్కపరచుటకై హాటకగర్భుడు మండనపండితుండై యుదయించి యున్నవాఁడు. ఈ చేడియ యాతనికి భార్యయై యనేకయజ్ఞములం గావించి పుత్త్రపౌత్త్రాది సంపదలతోఁ జిరకాలము సుఖియించును. పిమ్మటఁ గురుమతములచే నష్టమగు నుపనిషత్సిద్ధాంతముల సాధించు నిమిత్తము శంకరుండు పుడమి నవతరించి భూమిని బలవిన్యాసములచేఁ బవిత్రము జేయును. యతివేషము ధరించిన యమ్మహాత్మునితోఁ బెద్దతడవు వాదించి భవజ్జామాత పరాజితుం డగుచు నతనినే శరణము జొచ్చును సుమీ యని యెఱింగించి యత్తాపససత్తముం డంతర్హితుండయ్యె. తదుక్తిప్రకార మంతయుం జరిగినది. ఇతండు నీకు శిష్యుండు కా కేమగును? అయినను నీకు సంపూర్ణజయ మింకను గలుగలేదు. నే నతని సగము శరీరమును గానా? నన్నుం జయించి పిమ్మట నతనిని శిష్యునిగా జేసికొనుము. నీ వీ జగదీశ్వరుండవైన పరమపురుషుండవని యెరుంగుదు. అయినను నీతోఁ బ్రసంగింప నాకును ముచ్చటగా నున్నది. అని యిట్లు యాయజూక సహదర్మచారణియగు నుభయభారతి పలికిన విని తదీయమధురగంభీరార్ధయుక్తములగు వాక్యముల కానందించుచు శంకరు డిట్లనియె.

దేవీ! నా హృదయము వాదకలహోత్సుకత నొందుచున్నదని పలికితివి. కాని యది యనుచితమని తలంచెదను. కీర్తిశాలురు స్త్రీలతో బ్రసంగములు సేయుటకు సమ్మతింపరుగదా? యనుటయు నాభారతి యిట్లనియె. యతిప్రవరా! యెవ్వఁడు స్వమతఖండనము గావించునో యట్టివానిని జయించుటకు నాడుదిగాకాని మగవాడుగా కాని తప్పక ప్రయత్నం చేయవలయుంగదా? స్త్రీపుంసవివక్షతోఁ బని యేమి? అదియునుఁగాక మున్నుగార్గియను కాంతామణితో యాజ్ఞవల్క్యుండు ప్రసంగము చేయలేదా బృహదారణ్యకౌపనిషత్తు చూచుకొనుము. మరియు మోక్షదర్పిణోధితమైన జనకసులభాసంవాదము నీవు వినియుండలేదా? జనక యాజ్ఞవల్క్యాదులు యశోనిధులుగారా? స్వమతరక్షణార్ధమై ప్రవర్తించు నీ వట్లనుట యుచితముగాదని యుక్తియుక్తముగాఁ బలికిన విని యయ్యతిప్రవరుం డనుమోదించుచు వాక్యాధిష్ఠాత్రియగు వాగ్దేవితోఁ బ్రసంగము జేయుటకు సమ్మతించెను.