పుట:కాశీమజిలీకథలు-05.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

కాశీమజిలీకథలు - ఐదవభాగము

యీభూతలంబంతయు దురంతమోహమత్తులు పరమాత్మభేదకులు శ్రుతిగోభంజకులు నగు నభినవయవనులచే నాక్రాంతమైయున్నది. అట్టివాండ్రను సేవించువారి కెన్నఁడైన ముక్తి లభియించునా? విష్ణుతత్త్వానురక్తులగు భవదీయశిష్యు లందందు మెలంగుచుంటిరని తలంచి యాచింత వీడుచుంటిని అయ్యారే! అల్పబుద్ధివ్యాఖ్యోరగములచేఁ గరవఁబడి స్మృతిచెడియున్న శృతినికరముల భవదీయాసూక్తమృతసేకము దగిలి యిప్పుడు తెప్పరిల్లి హృదయాశయములఁ బ్రకటింపుచున్నవి గదా! దురంతసంసారఖరకరప్రచురాతపపరితాపము భవదృక్వమృతకరశరప్రచారమునంగాని యుపశమించునా?

అన్నా? తపఃశ్రుతగృహదారభృత్యధనాదులతోఁ గూడఁ గర్మయంత్ర మధిష్టించి యభిమానభరితుండనై సంసారకూపబిలంబునం బడుచుండఁ దటాలున వచ్చి నన్నుద్ధరించితివి. నీకంటె బరమరహితుండుఁ నాకెందేనిం గలడా? నేను తొంటిజన్మమున నెక్కుడు సుకృతము గావించితిని. లేకున్న నత్యంతాయోగ్యుండనగు నాకు జగదీశ్వరుండవైన నీ సంఘటన మెట్లు గల్గెడిని? దేవతలకు సైతము పురుషార్థ మాపాదించు కరుణాంతరంగితమగు భగవత్కటాక్షప్రవాహంబున ధన్యతముఁడుగాక యెట్లు మునింగెడిని? మహాత్మా? భవదీయశిష్యులు స్వర్గాదిసౌఖ్యంబులు తృణముగా నెంతురుగదా! భవన్మతం బిప్పటికిఁ దెలిసికొంటి దారాసుతాదుల విడిచితిని. నీ చరణంబుల శరణుఁ జొచ్చితిని. కరుణాభరితహృదయుండవై కింకరుండనైన న న్ననుగ్రహించి కర్తవ్య ముపదేశింపుమని తదీయపాదపద్మలం బడుటయు శంకరాచార్యుఁ డతని శిష్యునిఁగా ననుగ్రహింపదలచి తత్సహధర్మచారిణియైన యుభయభారతిని సాభిప్రాయముగాఁ జూచెను.

ఉభయభారతి బాల్యదశ

అమ్మహాదేవి యతని యభిప్రాయమును గ్రహించి యతిపుండరీకా! మండనమిశ్రుండు భవదీయశిష్యుం డగునని యింతకు బూర్వ మెరుంగుదును. విను మొకనాఁడు నేను బాల్యంబున మాతల్లినికటంబున వసియించియుండ రెండవమార్తాండునివలె మెఱయుచున్న తాపససత్తముఁ డొకండు విద్యుత్ప్రభాప్రతిభటంబులగు జటాపటలంబులు మకుటంబుగాఁ జుట్టికొని భూతిరుద్రాక్షమాలిక లొడలినిండఁ దాల్చి విచ్చేయుటయు నమ్మాహాత్ముని నర్ఘ్యపాద్యాదిసత్కారముల నర్చించి ప్రసన్నుడై యున్నసమయంబున నల్లన మాతల్లి యిట్లనియె ఆర్యా! మీరు తపోమహత్త్వంబున ద్రికాలవృత్తాంతములు కరతలామలకముగాఁ దెలిసికొందురుగదా? ఇప్పసికూన నా కూతురు, దీని నెక్కుడు గారాబముఁగా బెంచుచుంటిమి. దీని యాయు వెంత? పిల్లల నెందఱం గనును? పతి యెట్టివాఁడగు? ధనధాన్యము లేమైనం గలిగియుండునా? దీని భావి