పుట:కాశీమజిలీకథలు-05.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

89

నేపదము పరమమని నుడువఁబడినదో యాపదమును తత్త్వమస్యాయుధముల ధరించి నీవు పరిపాలించితివి. లేనిచోఁ బురుషార్థభ్రష్టులగు సౌగతుల ప్రలాపములను చీఁకటినూతులోఁ బడి యాపదము నాశనము నొందకపోవునా? ఆహా!

శ్లో॥ ప్రబుద్ధోహం స్వప్నాదితికృతిమతిః స్వప్న మపరం
     యథామూఢస్వప్నే కలయతితథామోహవశగా
     విముక్తింమన్వంతే కతిచిదిహలోకాంతరగతిం
     హసం త్యేతాన్‌దాస్తా స్తవగళితమాయాః పరగురో.

స్వప్నములోఁనుండియే మేల్కొంటిమని భ్రమఁ జెందుచు మరియొకస్వప్నములోఁ దలంచు మూఢుల పగిది మోహవశంబునఁ గొందరు మూఢు లనిత్యమగు లోకాంతరగతినే ముక్తినిగాఁ దలంతు రాహా! అట్టివారిం గాంచి భవదీయభక్తులు పరిహసింతురుగదా!

చ. అకటలం గలంగుచు భయంపడి మేల్కొనినట్టులందె వే
    ఱొకకలఁ గాంచురీచవిభుధోత్తమయస్యజగద్ధతింభ్రమా
    త్మకమతి నెంచుచుండి రమృతం బని కొందరు జ్ఞానయుక్తిఁ దా
    వకహితు లట్టివారి ననపాయగతిం బరిహాసమాడరే.

ఉ. ధారుణిభేదవాదికథితంబగు మోక్షము సీకరంబు ని
    స్సార మహో తదాశ్రయులు సంస్మృతిసంగతిఁ బాయకుందురౌ
    భూరితరప్రమోదపరిపూర్ణసుఖం బొనఁగూడు ఘోరసం
    సారము బాయఁ ద్వత్కథితసాధువిముక్తి భజించువారికిన్.

గీ. క్షితి నవిద్యా నిశాచరీ గళితు నీశు
   బయలుపరచితి తత్కుక్షి వ్రక్కలించి
   యతనిభార్యను దానవీవృతను సీతఁ
   గాంచి వచ్చిన హనుమ నీకంటె ఘనుఁడు.

చ. ఎరుగక యీదృశంబగు త్వదీయలసత్సరమప్రభావము
    ద్గురువముతోడ ని న్నలతిఁగాఁ దలపోసి తిరస్కరించి ని
    ష్టురములు పెక్కులాడితిని జూవె మహాత్మక! సత్కృపామతీ
    మరువుము వానినెల్లను గుమారునిపల్కులఁ దండ్రియల్గునే.

మహాత్మా! కపిలగౌతమకాణాదిప్రభృతులు సైతము శ్రుతిభావరహస్యంబుల నిర్ణయించువిషయమునఁ బరశివాంశసంభూతుండవైన నీ కెనయగుదురా! అయ్యయ్యో!