పుట:కాశీమజిలీకథలు-05.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

కాశీమజిలీకథలు - ఐదవభాగము

సూర్యకాంతుల మలినపరుచునా యని జైమినీయవాక్యములంగల రహష్యవిశేషంబు లెఱింగించిన విని యమ్మండనపండితుండు సభ్యులతోఁకూడ మిక్కిలి యానందించుచు నింకను సందియము హృదయమును బాధింపుచుండ నప్పుడు భక్తిపూర్వకముగా జైమినిం దలంచుకొనియెను. అట్లు మండనపండితుండు హృదయంబున ధ్యానించి నంతనే యాజైమినిముని సన్నిహితుండగుటయు నమస్కరింపుచు నతండు తమసంవాదప్రకారమంతయు నెఱింగించి, మహాత్మా యీయతిచంద్రుండు కర్మకాండ యంతయు నిరర్ధకమైనదనియు జ్ఞానకాండ ప్రధానమైనదనియు వాదించి భవదీయసూత్రాభిప్రాయ మట్టిదేయని వక్కాణింపుచున్నవాఁడు. అయ్యర్ధంబు మాకు విడిపోవకున్నది. అందలి నిక్కువం బెరింగించి సంశయనివృత్తి సేయుఁడని వేడుకొనిన నమ్ముని యిట్లనియె. సుమతీ! విను మాభాష్యకర్త మదీయసూత్రతతి కేయర్ధము సెప్పెనో నాహృదయ మదియేసుమీ ఇమ్మహాత్ముని వచనంబులు సందియము విడచి, యథార్థములని నమ్ముము. నా హృదయ మొకండే యననేల ? సకలవేదశాస్త్రములయొక్క యథార్ధాభిప్రాయ మెరింగిన ధన్యుండు. పెక్కులేల? భూతభవిష్యద్వర్తమానవిషయంబులఁ దెలిసికొను మహిమ యతిని కొక్కనికే కలదు. మరియు మదీయగురుండైన వ్యాసమహర్షి చేత నుపనిషత్తులకుఁ జిదేకరసతత్పరత్వము నిర్ణయింపఁబడినదిగదా. తత్ప్రసాదన మపాదితవిద్యావైభవుండనగు నేను తధ్విరోధముగా నొకసూత్రమైనం జెప్పుదునా? ఇంత మాత్రము దెలిసికొనరాదా?

ఈ మహానుభావుండు సంసారసాగరమున మునిగినవారి నుద్దరింప నవతరించిన పరమేశ్వరుండని తెలిసికొనుము. ఇది పరమరహస్యంబు.

శ్లో॥ ఆద్వేసత్వమునిస్సతాంవితరతిజ్ఞానంద్వితీయె యుగె
     దత్తోద్వాపరనామలేతు సుమతి ర్వ్యాసః కలో శంకరః
     ఇత్యేవస్ఫుటమీరితోస్యమహిమామావై వేపురాణేయత
     స్తత్యత్వం సుమతె మతెత్వవతరేస్సంసారవార్థంత రేః.

కృతయుగంబునఁ గపిలాచార్యుండును ద్రేతాయుగంబున దత్తాత్రేయులును ద్వాపరంబున శ్రీవేదవ్యాసభట్టారకుండును గలియుగంబున శ్రీశంకరుండును సజ్జనుల జ్ఞానముపదేశింతురని శైవపురాణములో నితనిమహిమ స్పష్టముగా వర్ణింపఁబడి యున్నది. కావున నీ వతని మతి ననుసరింపుము. సంసారసముద్రమును దరింతువని బోధించి జైమినిముని మనస్సుచేత నయ్యతిపతి నాలింగనముఁ చేసికొనుచు నంతర్థానము నొందెను. పిమ్మట మండనమిశ్రుఁడును శంకరునికి నమస్కరింపుచు నల్లన నిట్లనియె. మహాత్మా! నిన్నిపుడు దెలిసికొంటిని నీవు జగత్కారణుండవైన పరమపురుషుండవు. న్యూనాధిక్యరహితుండవు సర్వసముండవనబోధమాత్రశరీరుండవైనను మాబోఁటి పామరుల రక్షింప మూర్తీభవించితివి. యతివరా! అశేషశృతిశేఖరములచే