పుట:కాశీమజిలీకథలు-05.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

83

వాక్యములఁ గ్రియాకాండగతము లగుటచే విధిశేషములని చెప్పవలయును. కాని జ్ఞానకాండగతములగు తత్త్వమస్యాది వాక్యముల విధిశేషములని యెట్లు చెప్పఁదగినది.

మండ — యతీంద్రా! నీ వనిన యట్లే జీవునియందుఁ బరమాత్మ దృష్టి యుండుగాక అన్నము బ్రహ్మము. మనసు బ్రహ్మము. ఆదిత్యుఁడు బ్రహ్మము. వాయువు బ్రహ్మము. అని కర్మసమృద్దికొరకు అబ్రహ్మనుఁ బ్రహ్మనుగాఁ జెప్పినట్లే తత్త్వమస్యాది వాక్యములును గర్మసమృద్ధికొరకు నట్లు చెప్పినవి. కావున నుపాసనానుగుణ్యముగా నుపాసనావిధిశేషములని చెప్పవలయును.

శంక —- మనోబ్రహ్మేత్యుపాసీత! మనస్సునే బ్రహ్మగా నెంచి యుపాసింపఁదగినది. ఇత్యాది వాక్యములయందు విధింపఁబడిన లిదాదికము తత్త్వమస్యాది వాక్యములందుఁ గలిగియున్నదా? దాని నుపాసనావిధిశేషమని యెట్లు చెప్పుదువు విద్వాంసుడవయ్యు నిట్లు పలికెదవేల? విధియొక్క యభావముచేత నారోపింపఁబడిన బ్రహ్మభావము గల జీవునియొక్క యుపాసనాపరత్వము వేదాంతవాక్యములకు సంభవించదు. బ్రహ్మ యగుటయే ప్రమాణముగలవి.

మండ - యతివర్యా! వేదాంతవాక్యములు బ్రహ్మాత్మత్వంబునం బ్రమాణంబగుంగాక. సోమాయాగవిశేషములయందు ఫలదర్శనముకొఱకు విధి యెట్లు గల్పించఁబడినదో యాలాగులననే యిచ్చటను "బ్రహ్మవేదబ్రహ్మైవభవతీ" అను ముక్తిఫలమును దెలుపు శ్రుతికి బ్రహ్మలుభూషుః బ్రహ్మవేదనంకుర్యాత్. బ్రహ్మకా నిచ్ఛయించిన వాడు జ్ఞానమును దెలిసికొనవలయును. అని విధి కల్పించుకొనుట యుక్తము. అట్లైనచో బ్రహ్మ యన నేమి యాత్మ యన నేమి యని శంకించుకొని తత్స్వరూపసమర్పణమొచేత నిత్యుండు సర్వజ్ఞుండు సర్వగతుండు విజ్ఞానానందస్వరూపుండు అను మొదలైన వేదాంతవాక్యముల నుపయోగించుకొన తెలిసికొనవలయును. తదుపాసన వలన మోక్ష మప్రత్యక్షంబైనను శాస్త్రదృష్టంబు కాఁగలదు. అట్లు విధి కల్పించనిచో హనోపాదావశూన్యము వలన రాజాగచ్ఛతి సప్తద్వీపా వసుమతీ ఇత్యాది వాక్యములకుంబోలెఁ దత్త్వమస్యాది వాక్యముల కానర్థక్యము గలుగునుగదా! మఱియు బ్రవృత్తిని వృత్తుల బోధింపని వేదాంతవాక్యములకు శాస్త్రత్వము గలుగనేరదు.

శంక - అయ్యో! అట్లు విధి కల్పించినచో మోక్షము క్రియాజన్యమగుట స్వర్గాదికమువలెనే నశించునది యగుం గదా? స్వర్ణాదికమువలెనే మోక్షమునకు ననిత్యత్వసాతిసయత్వములు లేమింజేసి దానికిఁ గ్రియారూపము గల్పించుట యుక్తముగాదు. జ్ఞానము మాత్రము మానసక్రియాజన్యము గాదు? మీ మతంబున ముక్తి కనిత్యత్వ మేల ప్రాప్తించలేదంటివేని వినుము. జ్ఞానము మనోధర్మమైనను యథాభూతవస్తుప్రమాణాదికము మాత్రము దెలిసికొనుచున్నది. ఏ దేవతకొరకు హవిస్సు గ్రహింపఁబడునో వషట్కారములనే నా దేవతను ధ్యానింపవలెను. తచ్చింతనంబే మానసం బనంబడు.