పుట:కాశీమజిలీకథలు-05.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

కాశీమజిలీకథలు - ఐదవభాగము

యొక్కయు మతమందు బ్రవేశించువాడుకాడు. ఎన్నడైన బుడమి నొకపండితు డుదయించునా సరసప్రసంగకథ యెన్నడైనం జరుగునా యని యెల్లప్పుడును వేడుకపడుచుందును. ఇప్పు డట్టిజయమహోత్సవము స్వయముగా వచ్చినదిగదా నాభాగ్య మేమని కొనియాడుకొందును? ఇప్పుడు మనయిరువురకు బ్రసంగము జరుగుఁగావుత, పుష్కలమైన మదీయశాస్త్రపరిశ్రమ ఫలించుగాత స్వయముగా వచ్చియమృతము నోటబడుచుండ భూతలవాసిమాత్రము వలదనునా? అయ్యో దుర్హృదయగర్వకాంతారకుఠారమగు మదీయవాక్చాతుర్య మెరుంగక నన్ను వాదమునకు బిలుచుచుంటివిగదా! ఇసిరో! నన్ను వాదభిక్ష పెట్టుమని యడుగుట యత్యల్పమని తలంచెదను. నీకు వాదేచ్ఛ గలిగియున్నచో నాకు బండువేకదా! ప్రసంగవార్త వినినంతనే నాకు సంతోషము గలుగుచుండును. ఈ కోరిక నాకు జిరకాలమునుండి కలిగియున్నను నేపండితుండు దీర్పకున్నవాడు.

మంచిది తప్పక నీతో నిప్పుడు వాదము గావింతును. సందియములేదు. కాని మనవాదమునకు జయాపజయంబులు నిశ్చయించు మధ్యవర్తి యెవ్వడు అట్టి మధ్యస్థుండు లేనిచో బరస్పరవిజగీషులగు వాదిప్రతివాదుల సంవాదము కంఠశోషమే ఫలముగా గలది యగుంగదా! మరియు బ్రసంగించునప్పుడు మనకు జేయదగిన ప్రతిజ్ఞ యేది? యందలి ప్రమాణము నీ కేది సమ్మతము? నేను గృహస్థుడ నీవు భిక్షుండవు పిమ్మట నేమి యనినను లాభములేదు. కావున జయాపజయంబులకు బణము లేర్పరచుకొనినచో నవ్వుచు వాదమునకు బూనుకొనవలయును.

వాదము ఱేపు ప్రారంభింతము. ఇప్పుడు మాధ్యాహ్నికకృత్యంబులు నిర్వర్తించుకొని యాతిథ్యమందుమని పలికిన విని శంకరుండును సమ్మతించిన పిమ్మట మండనుండు మధ్యస్థులుగా నుండుఁడని వ్యాసజైమినుల బ్రార్థించెను. వా రప్పండితోత్తమునితో నార్యా! నీ భార్య సరస్వతి యంతటిది ఆ సాధ్వీరత్నంబు మధ్యస్థురాలై న్యాయంబున జయాపజయంబులు నిశ్చయింపఁగలదు అందులకు మీ యిరువురును సమ్మతింపుఁడని పలికి వారిరువురి నొడంబడఁజేసిరి. పిమ్మట నమ్మండనుఁడు వారి మువ్వురనుఁ ద్రేతాగ్నుం బోలె నర్చించుచు మధురాహారసంతృప్తులం గావించెను.

ఉపనిషదర్థంబుల నెరింగిన వ్యాసజైమినిశంకరులు మువ్వురును భుజించిన వెనుక నొకచోఁ గూర్చుండి మండనుని శిష్యులు పార్శ్వంబుల నిలిచి వింజామరల వీచుచుండఁ గొండొకసే పొండొరు లెద్దియో యాలోచనఁ జేసికొనిరి. వారట్లు కొంతసేపు సంతతముతో మంతనమాడి తద్గృహము నుండి వెడలి వ్యాసజైమిను లంతర్థానము నొందిరి. శంకరుండు నర్మదానదీపరిసరంబున మెఱయు నుద్యానవనములో నున్న దేవాలయములో వసించి శిష్యులతోఁగూడ నచ్చటి వార్తలం జెప్పికొనుచు నా దివసమును గడిపెను.