పుట:కాశీమజిలీకథలు-05.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

79

మం — యతిభంగమునకు బ్రవర్తించువానికి యతిభంగము దోషము కాదు గదా?

శం — యతివలన భంగమని దానికిఁ బంచమ్యంతమర్ధము చేసికొనుము.

మం — ఆహా. యీ కాలములోనా సన్యాసము? ఈ దుర్బుద్ధు లెక్కడ? బ్రహ్మవేత్తృత్వ మెక్కడ? స్వాదుపదార్ధములఁ దినుటకై యోగివేషము వేసికొందురు.

శం — ఆహా. యీ కలికాలములోనా స్వర్గము? ఈ దురాచారు లెక్కడ? అగ్నిహోత్రము లెక్కడ? మైథునకాములై కర్మిష్ఠులవేషము వేసికొందురు. నిశ్చయము.

అని యిట్లు రోషకషాయితస్వాతుండై మండనుండు దుర్వాక్యము లాడుచుండుటయు వానికి దగిన యుత్తరములు శంకరయతి యిచ్చుచుండుటయుం జూచి యందు భోక్తగా నియమింపబడిన వ్యాసుండు జైమిని చేత సపరిహాసముగా జూడబడుచుండెడి మండనమిశ్రుం జూచి యల్లన నిట్లనియె. వత్సా! మండన! తత్త్వవేత్తయైన యతి యతిథియై యింటికి వచ్చిన నర్చింపక యిట్లు దుర్భాషలాడుచుంటివే మి అభ్యాగత స్స్వయం విష్ణు వనుమాట మఱచితివా యేమి? చాలు జాలు ఈ ప్రసంగము గట్టిపెట్టుము. ముందుగా నతిథిపూజం గావింపుమని యాజ్ఞాపించెను. అమ్మునివరునిశాసనంబునం జేసి మండనుండు శాంతుండగుచు మారుమాట పలుకక జలము స్పృశించి శాస్త్రోక్తరీతి నతనిం బూజించుచు భిక్షకొరకు నిమంత్రితుంజేసెను. అప్పుడు శంకరాచార్యుడు మండనపండితునితో నార్యా! నే నన్నార్థినై నీయొద్దకు వచ్చియుండలేదు. వివాదభిక్షను యాచింపవచ్చితిని, సమర్థుడవేని యది పెట్టి పంపుము. అం దోడినవా రోడనివారికి శిష్యులై యుండునట్లు పణమేర్పరుపవలయును. యతినిషిద్ధమగు వాదభిక్ష నీ కేమిటి కంటివేని యుపనిషన్మార్గము వెల్లడిచేయుటకంటె నాకు వేఱొకకోరిక యం దిష్టములేదు.

సంసారతాపపరిహారకమై పరమానందసుఖం బొనరించు నమ్మార్గంబు కర్మతంత్రుండవగు నీచే దిరస్కరింపబడినది గదా? భవాదృశులనెల్ల వాదంబున భరిభవించి పుడమినెల్ల నమ్మార్గంబు రాజమార్గమై ప్రఖ్యాతి నొందజేసెను. నీవును బరమోత్తమమైన మదీయమతంబు స్వీకరింపుము. కానిచో వాదమునకు బూనికొమ్ము. దానికిం జాలనివాడవైతేని యోడిపోయితినని పలుకుమని యతి గంభీరవాగ్గుంభనలచే బలికెను.

మండనుం డయ్యతికులమండనుని వాక్యములు విని నూతనపరాభవమువలనం గలిగిన విస్మయముతో నాత్మగౌరవము ననుసరించి యిట్లనియె. ఏమంటివి? మండనుని పాండిత్యప్రకర్ష మెరుంగవు నీవననెంత? ఇతండు సహస్రముఖుండైన యనంతుడు వచ్చినను బరిభవించునుగాని జితోస్మియని పలుకువాడుకాడు. మఱియు వేదసమ్మతమగు మతమును విడిచి క్రొత్తగా గల్పించిన వ్యాసునియొక్కయు నీ