పుట:కాశీమజిలీకథలు-05.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

71

పుడమిఱేడు వాడినమోముతో నేమియుం బలుకక తలకంపించుచు నల్లన నాకుంభము మూత తీయించి చూడ నందు శేషశయనుండైన వాసుదేవుని యాకృతి గనంబడినది. పుడమియొడయుం డాకడవలోఁ దానినుంచినది మాఱి మదుక్తి ప్రకారముగా నుండుట తిలకించి దేహము పులకింప సందేహరహితుండై శ్రుతుల ప్రామాణ్యము సాద్గుణ్యమని నిశ్చయించి యహంకారముతో భయంకరులగు కింకరులం జూచి యిట్లనియె.

ఆసేతుహిమాచల మధ్యముననున్న బౌద్ధులనెల్ల నాబాలవృద్ధముగా వధియించిరండు జాలిచే నెవ్వడు చంపక విడుచునో వానిఁ జంపించెద నిది నిక్కువమని యెక్కుఁడు కోపముతో భృత్యుల కాజ్ఞాపించి యట్లు చేయించెను. మహాత్ము విష్ణునైనను దుష్టుడయ్యెనేని పరిభవింపక మానరు పరశురాముండు మున్ను దల్లిం జంపలేదా? అ ట్లల్పకాలములో సుధన్వుండు భృత్యుల జైనుల నెల్ల వెదకి వెదకి చంపించి వేదమార్గము నిష్కంటకముగాఁ జేసెను. అప్పుడు నేను భూమియంతయు వేదశాఖల వ్యాపింపజేసితిని. కర్మప్రతిపాదకమైన దారి బాగు జేసితినని యెఱింగించి భట్టపాదుండు వెండియు నిట్లనియె.

మహాత్మా! యొక యక్షరము జెప్పినను గురువని చెప్పబడుచున్నాడు. శాస్త్రముల నుపదేశించిన వానిమాట చెప్పనేల? ఏను బౌద్ధగురువునొద్ద దచ్ఛాస్త్రములన్నియుం జదివితిని. చివరకు దత్కులము నాశనము జేయించితిని. ఇంతకన్న మహాపాతక మేమి యున్నది. అదియునుం గాక బౌద్ధశాస్త్రంబుల జదువునప్పుడు పరమేశ్వరుని లేనివానినిగా నిందించితి. నీ పాతకంబులు బాపుకొనుతలంపుతో నీ తుషాగ్నింబడితి నంతకన్న భవదీయపాదదర్శనలాభం బెక్కుడు నిష్కృతియని తలంచెదను. యోగీంద్రా! నీవు భాష్యము రచించితివని విని దానికి వార్తికముజేసి యెక్కడు కీర్తి బొందెదనని తలంచితివి కాని యా మాటలతో నిప్పుడేమి ప్రయోజనమున్నది.

నీ వద్వైతమార్గము రక్షించుకొరకు నవతరించిన పరమేశ్వరుండవని యెఱుంగుదు. అయ్యో! నే నీతుషావలంబుఁ బ్రవేశింపకపూర్వమైనం దర్శనబిచ్చితివి కావే? యీ ప్రాయశ్చిత్తముతో నవసరము లేకయే కృతార్ధుండనగుదుంగదా? అన్నా! నీ భాష్యమునకుఁ గొంచెమైనను వార్తికముఁ జేయు భాగ్యము నాకు లభింపకపోయెనే. ఇప్పుడేమి చేయుదునని చింతించుచున్న భట్టపాదు నాదరించుచు దయామేదురములగు విలోకనము లతనిపైఁ బరిగించుచు శంకరుండల్లన నిట్లనియె. ఆర్యా! నీవు వేదచోదితకర్మవిముఖులగు బౌద్ధులు దండింప నవతరించిన షణ్ముఖుండవని యెరుంగుదును. నీ కొకపాతకంబు గలదా? సజ్జనధర్మముల బోధించుగొఱకు నిట్టినియమమునకుఁ బూనికొంటివి. మదీయకమండులజలంబుఁ బ్రోక్షించి నిన్నుఁ బ్రతికించెదను. సూత్రభాష్యమునకు వార్తికము రచియించెదవే యనుటయు ధర్మజ్ఞుండైన భట్టపాదుం డిట్లనియెను.