పుట:కాశీమజిలీకథలు-05.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

కాశీమజిలీకథలు - ఐదవభాగము

నిట్లనియె. ఆర్యులారా! జయాపజయంబులు విద్యాయత్తంబు లగుటం జేసి దీనివలన మతప్రాముఖ్యము తేటపడనేరదు. దైవతంత్రంబున దత్ప్రాధానత్వము బరీక్షించెదకాక. ఏ మతస్థుడు కొండశిఖరంబునుండి నేలంబడి యక్షతుండై యుండునో యాతనిమతమే నాకు సమ్మతమని పలికిన విని బౌద్ధు డొండొరుల మొగములు జూచుకొన దొడంగిరి. అప్పుడు నేను చేతులెత్తి నృపాలోత్తమా! సత్వరముగా నే నట్లు జేసి మన్మతప్రాబల్యంబు జూపించెదం బరీక్షింపుమని పలుకుచు వడివడి బోయి యొకయున్నతపర్వత మెక్కి యకల్మషుని వేదపురుషుని భక్తితో ధ్యానించుచు వేదమే ప్రమాణమైనచో నందు దైవమే కలిగియుండినచో నా కించుకంతయు దెబ్బ తగలనేరదని పలికి దుమికితిని. నిగమము తన్ను నమ్మియున్నవాని నేల రక్షింపకుండును.

అప్పుడు నేను దూదిబంతియుంబోలె నేలంబడి కసుగందక చెక్కు చెమర్పక యుంటిని. మేఘరవంబు విని నికుంజంబుల నుండి బయట వచ్చిన మయూరంబులచందంబున మదీయవార్త నాలించి దిక్కులనుండి పెక్కండ్రు బ్రాహ్మణు లచ్చటికి వచ్చిరి. అ ట్లక్షతుడనైయున్న నన్నుఁ జూచి యన్నరపతి శ్రుతిప్రభావంబు వేతెరంగుల గొనియాడుచు ఖలసంపర్కము వహించియున్న తన్ను బెక్కుగతుల నిందించికొనియెను.

చ. అకట! మహాప్రభవ సముదంచితముల్ నిగమంబు బట్టి వా
    నికిఁగల సారముం దెలియనేరక యూరక నింద సేయు నా
    స్తికుల మహాత్ములంచు గణుతించి మతిం బరమార్థ మేమి గా
    నక చెడిపోయితిన్ విబుధనాథ! యడింగితి నేఁడు నీ కృపన్.

అని పలుకుచున్నసమయంబున నాసౌగతులా నృపతిలకునితో నరేంద్రా! ఇంతమాత్రమునకే మీ రామత ముత్తమమని నిశ్చయింపవలదు. మరి మంత్రౌషధప్రభావంబుల దేహరక్షణఁ జేసికొనవచ్చును. అంతియకాని యిది దైవశక్తి కాదని పలికిన విని యలుక మెయి వికటభ్రుకటిభీకరముఖుండై యేమంటిరి! అది కపట మైనచో మరియొక దృష్టాంతము పరీక్షించెద నందోడిపోయిన వారి యంత్రోపలంబులఁ బెట్టించి మర్దింపజేసెదనని యుగ్రముగా శపథము జేసి యొకకుండలో గాలసర్పమునుంచి మూత పెట్టి దీనిలో నేమియున్నదో చెప్పుడని నన్నును సౌగతులను నడిగెను. అప్పుడు మే మావిషయము ఱేపు చెప్పదమని యొకదినము గడువు పుచ్చుకొని యిళ్ళకుంబోయితిమి. కంఠదఘ్నంబగు జలంబున నిలిచి నే నాలోకబాంధవు నారాధించితి. నన్నిగమన్వరూపుండు నాకు బ్రత్యక్షంబై వక్తవ్యాంశమును బోధించి యంతర్హి తుండయ్యె. మరునాడు మేమందరము రాజసభకు బోయితిమి. రాజు మమ్మందరి వస్తువెద్దియో చెప్పుమని యడిగిన బౌద్ధులు భుజంగమందున్నదని చెప్పిరి అప్పుడు నేను భోగీశభోగశయనుండైన శ్రీవిష్ణు వున్నాడని వ్రాసియిచ్చితిని నా మాట వినినతోడనే యా