పుట:కాశీమజిలీకథలు-05.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

69

తోచుచున్నాడు. మన మతధర్మములం గ్రహింపవచ్చెను గాబోలును. వేదనిందావాక్యంబులు విని యుబ్బక కన్నీరు విడిచినాడని యతనికి బోధించిరి. అదిమొద లాయుపాధ్యాయుడు నాయందు నమ్మకము విడచి మర్మముల జెప్పుమానుటయేకాక యొకనాడు నేను నిద్రించుచుండ నెత్తుగల మేడపైనుండి నన్ను నేలంబడ ద్రొబ్బించ్చెను. పడియెడుసమయంబున నాకు దెలిసివచ్చినందున వేదమే ప్రమాణమైనచో నే నీపతనబాధం బొరయక జీవింతునని పలికితిని ప్రమాణమైనచో నని సందేహపూర్వకముగా బలుకుటంజేసి నా కేమియు దెబ్బ తగులక యొకకన్ను మాత్రము పోయినది. అది విధి కల్పనయని నిశ్చయించి నేను సుగతమతమర్మము లన్నియుం గ్రహించియున్నవాడ గావున బౌద్ధుల నవలీల జయింప సామర్ధ్యము గలిగియున్నందున వారిం బరిభవింపు నుపాయం బాలోచించి యప్పుడు రాజుగానున్న సుధన్వునొద్దకుం బోయితిని. బౌద్ధులా మహీపతిగృహంబున శిష్యప్రశిష్యసహితముగా బ్రవేశించి యతనికి స్వమతబోధయంతయుం జేసి వైదికుల జేరనీయవలదని జెప్పియున్నను మదీయవిద్యాపాటవంబు దేటపరచి యతని మన్ననలం బడసితిని.

బౌద్ధమతస్తులచే నిండియున్న యప్పేరోలగంబున నానృపాలునిమ్రోల నేను వసియించి యున్న సమయంబునఁ దత్సమీపవిటపి నాశ్రయించియున్న కోకిల యొకటి మనోహరముగాఁ గూయుటయు నారవము నెపముగాఁ జేసికొని యీ పద్యమునుం జదివితిని.

క. పికమా! నీ కలశ్రుతిదూషకదుర్ఘోషకములు మలిన సంగతిగలనీ
   చక కాకవితతిరతి గలుగకయున్నం బొగఁడబడుదు గాదె ధరిత్రిన్.

అని చదువుటయు భావగర్భితమైన నా పద్యమును విని షడభిజ్ఞులు చరణతాడితంబగు భుజంగమంబు పగిది రోజుచు ఔరా! యీ వైదికుండీ సభాంతరంబున నిర్భయుండై యెంతమాట పలికెను! మనము కాకులమఁట మనసాంగత్యము లేనిచో నీ రాజు స్తోత్రపాత్రుండగునట. ఎట్టి మాటల వింటిమి! వీనిం బరిభవింపక పోనీయరాదని పలుకుకొనుచు నం దుద్దండులైనవారలు నాతో నప్పుడు ప్రసంగమునకుఁ బూనుకొనిరి. ఏనును నుద్దండపాండిత్యప్రకర్షంబుఁ జూపి యుక్తికుఠారంబున బౌద్ధసిద్ధాంతశాస్త్రవృక్షంబుల నఱకుచు జీర్ణంబులగు తద్గ్రంథంబు లింధనములుగాఁ జేసి వారి క్రోధానలజ్వాలల వర్థిల్లజేసితిని. అప్పుడు బౌద్ధులు మోములు జేవురింపఁ దెంపుతో నా వాక్యంబులు పూర్వపక్షంబులఁ జూపుటయు నే నవలీలగా సిద్ధాంతముఁ జేయుచుండగా నప్పుడు పాతాళము భేదిల్లునట్లు పెనురవము బయలు వెడలినది అప్పుడు విజృంభించి నేను తదీయసర్వజ్ఞపదంబు సహింపక కర్కశతర్కవాక్యప్రసంగములచే వారిఁ ద్రుటిలో నిరుత్తరులం జేసితిని. బౌద్ధులు దర్పంబు లుడిగి యూరకున్నంత నమ్మేదినీకాంతునకు నేను వేదప్రభావమంతయు బోధించిన విని యతండును విస్మయము నొందుచు