పుట:కాశీమజిలీకథలు-05.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

కాశీమజిలీకథలు - ఐదవభాగము

నొకప్పుడు చెడ్డయుం గలుగజేయును. ఒకప్పుడు కలుగజేసి విడఁజేయును. పెక్కు లేల! సుఖాసుఖంబులు కాలకృత్యములు గదా!

ఏను వేదమునకు గర్మమార్గము నిర్ణీతము సేసితిని. నైయాయికుల యుక్తిజాలముల ఖండించితిని. విషయసుఖంబుల ననుభవించితిని. కాని యీ కాలప్రవృత్తిని మాత్ర మతిక్రమింపలేకపోయితిని. నరులకు గాలానుగుణ్యమైన బుద్ధి బొడముచుండును. వేదంబులకు స్వాతంత్ర్యము కల్పించి యీశ్వరు నిరాకరించితి. గురుద్రోహంబు గావించితి. నీ రెండుపాతకంబుల బాయుటకై తుషానలంబు బ్రవేశించుచున్నవాడనని పలికిన విని శంకరుడతి విస్మయము జెందుచు మహాత్మా! నీవు గురుద్రోహ మేమిటికి గావించితివి. తద్వృత్తాంతము వక్కాణింపుమని యడిగిన నతం డిట్లని చెప్పదొడంగెను.

భట్టపాదుని పూర్వ వృత్తాంతము

ఏను జనించువరకు జగంబంతయు బౌద్ధమతము వ్యాపించియున్నది. వైదికతంత్రము లాకాశకుసుమంబులై యున్నవి. అట్టియెడ నేను స్వల్పకాలములో వేదవేదాంగముల జదివి క్రమ్మర వేదమార్గము జక్కజేయవలయునని తలంపుతో నుద్దతులైయున్న సుగతు బరాజితులం గావించినంగాని యిట్టిపని నెరవేరదని నిశ్చయించి యచ్చటచ్చట వారితో బ్రసంగములు సేయుచుంటిని గాని తదీయమతశాస్త్రప్రవృత్తి దెలియమింజేసి నాకు వారితో మాటాడుటయే దుర్ఘటమైనది అప్పుడు నేను వినీతవేషముతో నొక బౌద్ధమతగురువు నొద్దకు బోయి అయ్యా! నేను బౌద్ధమతస్థుండ. దచ్చాస్త్రంబులన్నియు నాకు బోధింపుడని వేడుకొనిన నిక్కువమనుకొని యాసుగతగురువు తన శిష్యులతో గూడ దన్మతమర్మంబులన్నియు నాకు బోధించెను.

ఒకనా డాభసయందు బక్షబుద్ధిగల బౌద్ధుడొకడు నిలువంబడి యోహో! వేదములు ప్రత్యక్షప్రమాణవిరుద్ధముగా నీశ్వరు డెవ్వడో యున్నాడని చెప్పుచున్నవి. తద్వాక్య మెంత సత్యమో చూడుడు ఉన్నవాడు కనబడకుండునా! మొదట గర్మ చేయుమని చెప్పి తరువాత గర్మతో నేమియు బ్రయోజనము లేదని చెప్పుచున్నది. సీ! యింతయసత్యవాది యెందైన గలదా! యిట్టిదానిమాట ప్రమాణముగా దీసికొని జీవహింసల జేసెడు వైదికుల నేమి చేసినను దోసము లేదు కదా! కటకటా! యింత పాడుశాస్త్ర మెందునులేదు. వైదికులం జూచిన మహాపాతకములు రాగలవు అని యూరక వేదదూషణ చేయుచు నుపన్యాసము జెప్పెను.

ఆ మాటలు విని తథాగతులందరు జయబుద్ధా! యని పలుకుచు గరతాలంబులు వాయించిరి. కర్ణకఠోరంబులగు నా వాక్యములు నేను విననొల్లక చెవులు మూసికొని కన్నీరు విడువజొచ్చితిని. అప్పుడు నా ప్రాంతమందున్న బౌద్ధశిష్యులు నా దుఃఖమును జూచి శంకించుకొనుచు దమగురువుతో, అయ్యా! వీడెవ్వడో వైదికుండట్లు