పుట:కాశీమజిలీకథలు-05.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xi

కేమియుఁదెలియలేదు. ఆ విషయములెల్ల దరువాత మీ వలనం దెలిసికొనునభిలాషతో నిందు గూరుచుంటి నాయందక్కటికముంచి యత్తెరంగెరింగింపుడని కోరిన నాయతిశేఖరుం డిట్లనియె.

శ్లో॥ అశ్వాలంభం గవాలంభం సన్యాసంపలపైతృకం
     దేవరాచ్చసుతోత్పత్తిఃకకా పంచవిసర్జయేత్.

కలియుగమున సన్యాసము స్వీకరింపగూడదని మునులచే నిరూపింపబడినది. శంకరాచార్యు లవతరించి సన్యాసము స్వీకరింపవచ్చునని ప్రమాణములు చూపుచుఁ దిరిగి స్థాపించెను. ఆ శంకరయతీశ్వరులచేఁ బ్రస్థానత్రయమునకు భాష్యము లద్వైతపరముగా రచింపఁబడినవి. అందలి విషయములు ముముక్షువులకుఁ జాల నింపుగా నుండును. గాన మేము ముచ్చటించితిమని చెప్పిన శిష్యుండు, స్వామీ! శంకరాచార్యులు పరకాయప్రవేశము చేసెననియు నెవ్వరితోనో వాదించెననియు నొకప్పుడు నాకు సంక్షేపముగాఁ జెప్పితిరి. మీరు చెప్పినంత కథయే యెంతో రుచిగా నున్నది. అప్పుడు వేరొక కథాసందర్భములో నాకథఁ జెప్ప మానివేసితిరి. నేటికి వెండియు నామహాత్మునిపేరు జ్ఞాపకము జేసితిరి. నేడు నేను మీ ప్రసంగము వినుచు నెక్కటికింబోక నిందే గూరుచుంటిఁ గావున నిప్పుడా శంకరాచార్యు కథయంతయు సాంతముగాఁ జెప్పవలయునని వేడుకొనుటయు మణిసిద్ధుండిట్లనియె.

వత్సా! యెన్ని దినముల నుండియో నీకీ పుణ్యచారిత్రము చెప్పవలయునని సంకల్పము గలిగియున్నది. యెప్పటికప్పుడేదియో ప్రశంసమీద మానివేయుచున్నాను. నేడు సుదినము. తద్వృత్తాంతమంతయు వక్కాణించెద సావధాన మనస్కుండవయి యాకర్ణింపుమని శంకరులకు నమస్కరించుచు నిట్ల చెప్పందొడంగెను.