పుట:కాశీమజిలీకథలు-05.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

కాశీమజిలీకథలు - ఐదవభాగము

శ్రు. తముల్క్రోమంతం ప్రాణోనుత్క్రామతి
    ప్రాణము త్క్రామంతం సర్వేప్రాణా అనుత్క్రామంతి.

జీవుండు దేహమును విడిచిపోవునప్పుడు వాని ననుసరించి ప్రాణము పోవును. ఆ ప్రాణము ననుసరించి యితర ప్రాణములు పోవును. ఆశ్రయములేక ప్రాణములయొక్క గమన మసంభవము. కావున దదాశ్రయములగు భూతసూక్ష్మముల యొక్క గమనమర్థాత్తు తోడఁబడుట లేదా? నిరాశయములై ప్రాణము లెక్కడికి బోవును? ఉన్నప్పుడెవ్వరికైనఁ గనంబడుచున్నవియా? మృతునిగా గాదు. లగ్న్యాదులఁ బొందుచున్నవని చెప్పిన శ్రుతి గౌణమైనది. కాని ముఖ్యమైనదికాదు. జీవము ప్రాణోపాధిశూన్యుఁడై యరుగునని చెప్పుటకు వీలులేదు. దేహాంతరమందుఁ బ్రాణములు లేక యుపభోగము సంభవింపదు కావున బాగాదుల కుపకారములై యధిష్టాతృదేవతలగుట మరణకాలమున నవి చేయు నుపకారము నివృత్తియైనది. కావున వాగాదు లగ్న్యాదులను బొందుచున్నవని చెప్పఁబడినది.

మరియు బ్రథమాగ్నియందు బంచమాహుతియగునప్చబ్దము ప్రయోగింపఁ గూడదంటిరి. అట్లు ప్రయోగించుట దోషముకాదు.

అప్ఛబ్దము ప్రథమాగ్నికి హోమద్రవ్యమగు శ్రద్ధాశబ్దాధి స్రాయముగాఁ బ్రయోగింపఁబడినది. మరియు

ఉదకములు పంచమాగ్నియందుఁబడి పురుషుఁడెట్లగునని ప్రశ్నవేయగాఁ బ్రథమాహుతికి హోమద్రవ్యమగు శ్రద్దను ప్రతివచనముగాఁ జెప్పినచోఁ బ్రశ్న యొక్కటియు సమాధానము మరియొకటియు కాదా శ్రద్ధ జీవునియొక్క మనోధర్మమై యున్నది. అది ధర్మీవలన విడదీసి హోమము చేయుట శక్యముకాదు. కావున అప్పడే శ్రద్ధాశబ్దముచేత గ్రహింపఁదగినది. శ్రద్ధవా ఆపః అనవదిక ప్రయోగము వలన శ్రద్ధాశబ్దమున కప్పులయందుపపత్తి చెప్పవచ్చును. పీలరూపముగా నరుగుచున్న యప్పుల సూక్ష్మత్వగుణయోగముచేత మాణవకునియందు సింహశబ్దమువలెనే వాని యందు నిష్పన్నమగుచున్నవి అని యీరీతి నుపన్యసించి వృద్ధబాహ్మణుని శంకల సహస్రముఖంబుల ఖండింపుచుఁదానుడివిన యర్థమును స్థిరపరచుకొనియెను. పిమ్మట శంకరుఁడు నుడివిన యర్ధముల వేయు మార్గముల ఖండించి యావృద్ద బ్రాహ్మణుఁడు స్వపక్షమును రక్షించుకొనియెను. ఈరీతి వారిరువురకు నెనిమిది యహోరాత్రంబు లేకరీతి సంవాదంబు జరిగినది. తదీయ విద్యామహత్త్వములకు విస్మయమును జెందుచు శంకరాచార్యుండెనిమిదవనాఁడు సాయంకాలమున రహస్యముగాఁ బద్మపాదుఁజూచి, వత్సా ఈ బ్రాహ్మణుని యాకారమున జూడ సామాన్యముగాఁ గనఁబడుచున్నది. ఈతండు సకల విద్యాపరిపూర్ణుండనుటకేమియు సందియములేదు. తప్పుత్రోవలఁ ద్రొక్కియుఁ బ్రసంగములో యుక్తులచేఁ దన వాదమును నిలుపుకొనుచున్నవాఁడు. వీనింగెలుచుట యెట్లో తెలియకున్నయది. ఉపాయమేమని యడిగినఁ బద్మపాదుండు,