పుట:కాశీమజిలీకథలు-05.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

61

రూపముగాఁ బురుషుని యందు బ్రవేశించి రేతోరూపముగా స్త్రీగర్భములోఁజేరి పురుషుఁడగుచున్నాడు. ఈయర్థమునే సూత్రకారులు వ్రాసిరని శ్రీశంకరాచార్యులు చెప్పగా విని నవ్వుచు నావృద్ధబ్రాహ్మణుఁడు ఓహోహో! నీ భాష్యము చాల బాగున్నది. ఇది యెక్కడి యర్ధము; ఎక్కడికల్పన చాలు! చాలు! అని యాక్షేపించుచు దేహాంతర ప్రతిపత్తియందుఁ గర్మవశంబున వృత్తిలాభము. వ్యాపులగు నింద్రియములకు నాత్మకుఁ గూడ గలుగుచున్నదా! కేవలము ఆత్మకే కలుగుచున్నదా? ఇంద్రియములు దేహమువలెనే క్రొత్తవియేకదా! అక్కడక్కడ భోగస్థానమును బుట్టించుచున్నవి. లేక మనస్సునైన జెప్పికొనవచ్చును అదియట్లుండ చిలుక యొకచెట్టు నుండి మరియొక చెట్టునకెగిరిపోవునట్లు జీవుఁడు ఒకదేహమును విడిచి మరియొక దేహమున కెగిరిపోవునా ఏమి? దేహాంతర ప్రతిపత్తియందు నింద్రియములు జీవునితోఁ బోవుననుట శృతివిరుద్దము వినుము.

శ్రు॥ యత్రాస్యపురుషస్య మృతస్యాగ్నిం వాగప్యేతివాతం
      ప్రాణశ్చక్షురాదిక్యం మనశ్చంద్రమసందిశశ్చోత్రమితి॥

మృతినొందిన పురుషుని యొక్క వాక్కు అగ్ని ప్రాణములు వాయువును చక్షుస్సులు సూర్యుని మనస్సు చంద్రుని శోత్రములు దిక్కులనబడును. అని శ్మృతి చెప్పుచున్నది అవి జీవునితో నెట్లుపోవును. అదియునుం గాక మీరు చెప్పినతాఁడి శ్రుతి యందుగల పంచమ్యామాహుతావాపః పురుషవచసో భవంతి యని నిర్ధారణ చేయుటకు వీలులేదు. ప్రథమాగ్నియందు నుదకాహుతి పరికల్పనము అసమంజసము. ద్యులోకప్రముఖములగు పంచాగ్నులు క్రమంబున శ్రద్ధాదిరూపములగు నాహుతులకు నాధారముగాఁ బరికల్పింపఁబడినవి. ప్రథమాగ్నికిఁ బ్రసిద్ధమగు శ్రద్ధనువిడిచి యప్రసిద్ధమగు నుదకమును జెప్పుట మీ సాహసము గాని వేఱొకటికాదు మఱియు జీవుఁడు భూతసూక్ష్మములతోఁగూడికొని పోవుననుట మీ కల్పితము. శాస్త్రసమ్మతము కాదని వాదించుచు శంకరోక్తమును నూరువిధముల ఖండించెను.

అప్పుడు శంకరులు చిరునగవుమొగంబునకు నగయై మెరయ, అయ్యా! తాముపన్యసించిన విషయంబులు సాంఖ్యబౌద్ధ వైశేషిక దిగంబరులయొక్క కల్పనలు గాని వేదసమ్మతములు గావు వినుండు. కేవలము బ్రశ్న ప్రతి వచనములలోని యప్ఛబ్ద ప్రయోగమువలన నొక్క యుదకములతోనే కూడికొనిపోవుచున్నాడని చెప్పరాదు అవి కలసియుండుటచే నట్లు ప్రయోగింపఁబడినది. కేవలము ఉదకములతోఁకూడిన దేహారంభమగునా! కాకున్నను నితరభూతాపేక్షచేత నుదకము లెక్కువగా నుండుటచేత నప్ఛబ్దము ప్రయోగింపబడినది. అప్ఛబ్ద ప్రయోగము వలన దేహబీజములగు భూతసూక్ష్మముల నైదింటియొక్క యుపపాదనము గలుగుచున్నది.

మరియు దేహాంతరప్రతిపత్తియందుఁ బ్రాణములయొక్క గతి శ్రుతికధితమైయున్నది.