పుట:కాశీమజిలీకథలు-05.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

కాశీమజిలీకథలు - ఐదవభాగము

సమస్తోపనిషత్స్వతంత్రుండైన యీ శంకరాచార్యుని ప్రభావము మీరు వినియే యుందురు. దూరీకృతభేదవాదముగా నిమ్మహానుభావుండు బ్రహ్మసూత్రములకు భాష్యముఁజేసి యది మాకుఁ బాఠముఁ జెప్పుచున్నాఁడు అని చెప్పిరి.

ఆ మాటలువిని యా వృద్ధబ్రాహ్మణుండు ఏమేమీ! మీ గురుండు సూత్రభాష్యమునే రచించెనా! అయ్యారే! ఎంతచిత్రము! బాపురే! ఎట్టి మాటవింటిని! భళిరే! ఎట్టి పండితునిం గనుఁగొంటిని! ఆహా! నేఁడెంత సుదినము. అని పెక్కు తెరంగుల విస్మయమభినయించుచు శంకరునితో, స్వామీ! మీరు సూత్రభాష్యమును రచించితిరని మీ శిష్యులు చెప్పుచున్నారు. మీప్రజ్ఞాప్రభావంబు లనన్యసామాన్యములని కొనియాడఁ దగినదే! ఏదీ! ఒకసూత్రమును జదివి యర్ధమును జెప్పుఁడు! మీ సామర్ధ్యమెట్టిదో వినియెదంగాక యని యడిగిన శంకరుడిట్లనియె. ఆర్యా! నేను సూత్రార్ధముల లెస్సగా నెరిగినవాఁడనని చెప్పుకొనజాలను సూత్రార్థవేత్తలను గురువులఁగా నెంచి నమస్కరింపుచు నాయెరింగినంత వక్కాణించెద. ఏ సూత్రమున కర్థముఁ జెప్పవలయునొ తమరే వాగ్రుచ్చుఁడు. అని ప్రత్యుత్తర మిచ్చెను. అప్పుడా బ్రాహ్మణుండు, యతీంద్రా! మీ మాటలకు సంతసించితిని. వినుము. మూఁడవ యధ్యాయములో మొదటి సూత్రము.

సూ॥ తదంతర ప్రతిపత్తౌరంహతి సంపరిష్వక్తః ప్రశ్న నిరూపణాభ్యాం.

ఈమాత్రమునకు భాష్యములోనెట్టి యర్థము వ్రాసితిరో వక్కాణింపుఁడు. అని యడుగుటయు శంకరుండు తదంతర ప్రతిపత్తౌ రంహతి సంపరిష్వక్తః ప్రశ్నవిరూపణాభ్యాం అని పదవిభాగముజేసి జీవుఁడు ఇంద్రియములయొక్క యవసాదమున అనగా మరణసమయమున దదంతర ప్రతిపత్తౌ దేహాంతర సంక్రమణము విషయమై నంపదిష్వక్తం దేహబీజములగు భూతసూక్ష్మములతోఁ గూడికొని రంహితి వెళ్ళుచున్నాడు. ప్రశ్న నిరూపణాభ్యాం ఈ యర్ధము తాండీశ్రుతియందుగల గౌతమ జైమినులయొక్క ప్రశ్నోత్తరములచేఁ ప్రఖ్యాతమగుచున్నది.

ప్రశ్న - వేత్థయథా పంచమ్యామాహుతావాపః

ఉత్తరము — పురుషవచసో భవంతి.

ఆకాశము, మేఘము, భూమి, పురుషుఁడు, స్త్రీ, వీని నైదగ్నులుగా నిరూపించి ఈ యగ్నులయందు అపః అనగా శ్రద్ధ చంద్రుఁడు వర్షము అన్నము రేతస్సు. వీని నైదింటిని నాహుతులుగా నిరూపించి ఈయాహుతుల నాయగ్నులయందు హోమము సేయగా నేమగును! అని గౌతముఁడు ప్రశ్న వేయగా జైమిని పురుషవచసో భవంతి. పురుషుఁడని పిలువఁబడుచున్నాడు. అని యుత్తరముజెప్పెను. అనగా జీవుడు. దేహాంతరప్రతిపత్తికై దేహమునకు విత్తనములైన భూతసూక్ష్మములతోఁ గూడికొని తొలుత నాకాశములో శ్రద్ధారూపముగాఁజేరి (అనగా వివేకానుసారముగాననుట) చంద్ర కిరణములద్వారా మేఘములయందుం బ్రవేశించి వర్షరూపముగా భూమికివచ్చి అన్న