పుట:కాశీమజిలీకథలు-05.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

59

పద్మ — అగు. శంకరార్కుని భాష్యప్రభ సజ్జనహృదయాజ్ఞములఁ బ్రకాశింపఁజేయుచు దమస్సముదయంబుల విదళింపుచుఁ బ్రతివాది ఘూకములఁ జీకాకు నొందించుచు బ్రకాశించుచున్నదిగదా?

వామ — గంగా ప్రవాహము పద్మనాభుని పాదంబునం బుట్టి సేవించిన వారిని ముంచుచున్నది. సూత్రభాష్య ప్రవాహము శంకరుని వక్త్రంబునం బొడమి సేవించిన వారిం దేల్చుచున్నది. ఇది యంత కన్న నెక్కుడుకాదా?

పద్మ - వ్యాసమహర్షి సూత్రకలితములగు న్యాయరత్న మాలికల నమ్మ దెచ్చిన నర్థలాభముఁ బడయమింజేసి బుధులు చిరకాలము గొనలేకపోయిరి. ఇప్పుడీ యతిపతి వలన నర్ధాప్తింబడసి తత్సూత్రరత్న మాలికచేఁ బండితులు మండితు లగుచున్నారు. వ్యాసుండును గృతార్థుండయ్యె. ఆహా? శంకరగురుని యౌదార్య మెంత యాశ్చర్యకర మైనదో చూచితివా!

వామ - బాగు. బాగు. లెస్సగా వర్ణించితివి! మఱియు వేదబాహ్యులచే మిథ్యావ్యక్తియని దూరముగాఁ ద్రోయఁబడి భట్టప్రభాకరాదులచే గర్మవియోజ్యుఁడగు పురుషునిం బరిచరింపఁదగునని పీడింపఁబడి పదార్థవంచనలం జేయునైయాయికాదులచే మృదువుగాఁ గ్లేశము నొందింపఁబడిన యుపనిషద్దేవి మన శంకరుగురుని శరణుఁజొచ్చి పరమానందమును బొందుచున్నది. అరసితివా?

పద్మ - తదభివ్యక్తుండగు పరమపురుషునిఁ జంపుటకై బౌద్ధుండు తరుమఁగాఁ గణాదుం డడ్డమువచ్చి యాత్మలాభము గలుగఁ జేసి యా వెరపుడిపెను. పిమ్మట భట్టపాదుండు నిజపదగమనమునకు మాత్రము మార్గముఁ జూపెను. తరువాత సాంఖ్యులు దుఃఖమును బోగొట్టిరి. పాతంజలులు ప్రాణధారణంబున నతనికిఁ బూజ్యత్వముం గలుగఁజేసిరి. ఇట్లు పెక్కు చిక్కులఁబడిన పరమపురుషునిఁ గరుణచే మనశంకరగురుండు పరేశునిగాఁజేసి యానందముఁ గలుగఁజేసెను.

అని బ్రహ్మసూత్రభాష్యమును బెక్కు తెరంగుల స్తోత్రములు సేయుచు వారు నిష్క్రమించిరి.

వ్యాస దర్శనము

మరియొకనాఁడు శంకరయతిచంద్రుండు గంగానదీ సమీపంబునం గూరుచుండి సూత్రభాష్యము శిష్యులకుఁ బాఠముఁ జెప్పుచుఁ దదీయశంకల కుత్తరంబులు సెప్పుచుండఁ గుతపకాలంబగుటయు నలసి స్నానముఁ జేయుటకై లేవఁ బ్రయత్నించుచున్న సమయంబున నొక వృద్ధ బ్రాహ్మణుం డచ్చోటికి వచ్చి దండంబూతగాఁబూని శంకరాభిముఖుండై నిలువంబడి అయ్యా! నీవెవ్వండవు? శిష్యుల నేమి చదివింపుచుంటివని యడిగెను. అప్పుడు శిష్యులా బ్రాహ్మణునితో నార్యా! ఈయన మాయాచార్యుండు.