పుట:కాశీమజిలీకథలు-05.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

63

మహాత్మా! ఈతండు బ్రాహ్మణమాత్రుండుగాడు. యుష్మత్పాండిత్యప్రకర్షము నరయు తలంపుతో వ్యాసమహర్షి యిట్టివేషముతో నరుదెంచెనని తలంచెను. కానిచో నొరునకిన్ని దినంబులు మీతో వాదించుటకు శక్యమా! నీవు శంకరుండవు. అతండు నారాయణుండు మీరిరువురు ప్రసంగము సేయుచుండ మాబోటి కింకరుల మేమి దెలిసికొనఁగలము. మీయిరువుర ప్రసంగములు వినుచుంటిమి. పూర్వపక్ష సిద్ధాంతముల ప్రసక్తియించుకయు మాకు బోధపడలేదు. మీరు మహానుభావులకు మీమహత్వము మీకే యెరుకయని పలికిన విని శంకరుండు పులకాంకురంబులు మేనంబొడసూప నతండు వ్యాసుండుగా నిశ్చయించి నిటల తటఘటితాంజలిపుటుండై యిట్లని నుతించెను.

మ. యతిరాట్చంద్రమ! నీకు నా రచితమౌ నద్వైతభాష్యంబు స
     మ్మతమేనిన్భవదీయ సూత్రములకు న్మన్నించి నా తప్పు ల
     ద్భుత విద్యుద్విల సజ్జవామకుటమై స్పూర్జద్వినీలాంబు దా
     యత చారుద్యుతి భాసమానమగు నీ యాకారమున్ జూపవే.

అని ప్రార్థింతునంతలో నమ్మహానుభావుండు.

సీ. కనకవల్లీ లసద్ఘసజటాతతివానిఁ
          దటిదంచితాబ్ద సుందరము వాని
    జ్ఞానము ద్రావిరాజత్క రాబ్జము వానిఁ
          బ్రవరదంద కమండలువులవాని
    రుద్రాక్షమాలికా కుచిరవక్షమువాని
          వసితాజినోత్తరీయంబువాని
    నద్వైతతత్త్వ విద్యావేత్తయగువాని
          ఛాత్రసంఘాధ్య పార్శ్వములవాని

గీ. నతిశయకృపాకటాక్షవీక్షామృత ప్ర
    వర్షధారానివారితాప్తజనతాను
    తావు విభజితనిగమకలాపుఁదాప
    ననివహోల్లాసుఁ వ్యాసుఁ గన్గొనియె నెదుట.

గీ. కని వినేయులతో నెదుర్కొనితదీయ
    చరణపద్మములకు మ్రొక్కి శంకరుండు
    పూతచరితుని సత్యవతీతనూజుఁ
    బలికెభయభక్తి వినయసంపదచెలంగ.