పుట:కాశీమజిలీకథలు-05.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

57

బయలువెడలి యుత్తరాభిముఖుండై యొకచో నత్యుష్ణమై యొకచో నతిశీతలమై యొకచోవక్రమై యొకచో నుత్కుంటకమై మూర్ఖచిత్తంబువలె నొప్పుచున్న మార్గంబున నడచుచు నవ్యయుండు నక్రియుండునగు పరమాత్మ స్వరూపుండు తానయ్యును లోకరీతి ననుసరించి పాంథులతోఁ గూడ నడుమ ఫలంబులందినుచు నీరు ద్రావుచుఁ గూర్చుండుచుఁ బండుకొనుచు నతిప్రయాసమునఁ గతిపయ ప్రయాణముల బదరికారణ్యమున కరిగెను.

అందు గంగా ప్రవాహశీకర పరంపరోద్భూతములగు వాతపోతంబులచే గమనాయసంబుఁ బాయఁజేసికొని శంకరుండు శిష్యవర్గంబుతోఁ గూడ నందలి ముని బృందములచేత నర్చితుండై తద్గోష్టీ విశేషంబులచేఁ గొన్ని దినంబులఁ గడపెను.

భాష్య ప్రచారము

శ్రీ శంకరాచార్య శేఖరుండా బదరీవనంబునఁ బండ్రెండవ యేఁట సమాధి నిష్టులగు బ్రహ్మఋషులతోఁ గూడ బలుమా రుపనిషదర్థంబుల విమర్శించి షడూర్ముల చేతను సప్తధాతువులచేతను, విషయ పంచకముచేతను, అంతఃకరణ చతుష్టయము చేతను, అభివ్యక్తమగు శరీరతత్త్వ మెఱింగించుటకై భవ్యంబై మధురంబై గంభీరార్ధ యుక్తంబై యొప్పునట్లు సూత్రభాష్యము రచించెను.

గీ. కరగతంబగు నుసిరిక కాయవోలె
   మేటి యద్వైతతత్త్వంబుఁ దేటపరచి
   నిరసితాజ్ఞానమై మనోహరతనొప్పి
   శంకరాచార్యసూత్ర భావ్యంబుదనరె.

మఱియు నందయ్యతిచంద్రుండు బ్రహ్మవిద్యాప్రతిపాదకంబులగు నీచ కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీ, యైతరేయ, ధాందోగ్య, బృహదారణ్యాద్యుపనిషత్తులకును మహాభారత సారభూతంబులగు గీతలకును నిరవద్యము లైన భాష్యంబుల రచించెను. వానినేకదా ప్రస్థానత్రయమని వాడుదురు. పిమ్మట భారతమునకు సనత్సుజాతీయమను వ్యాఖ్య రచించెను. తరువాత నుపదేశసహస్రికా గ్రంథముల నసంఖ్యాకముల రచించి విద్వజ్ఞన గీయమానుడై పరమార్ధపదేశంబున లోకోపకారంబు గావించెను. శంకరుండను దినకరుండుదయించి ప్రకాశింపుచుండఁగ కుమతి ప్రణీతంబులగు వ్యాఖ్యాంధకారంబులు దుర్వాదిచంద్ర ప్రభతోఁ గూడ నాశనము నొందినవి. శంకరుండట్లు భాష్యములరచించి తన శిష్యులకుఁ బాఠములఁ జెప్పి తదర్థముల నెల్ల జక్కగా బోధించెను. నిరుపమాన భక్తి విశ్వాస సమంచిత చిత్తుండగు