పుట:కాశీమజిలీకథలు-05.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

55

కద్వ్యతిరిక్క్త మించుకయు లేదని యెవ్వని మనంబున దృఢ నిశ్చయము గలిగి యుండునో వాడెట్టివా డైనను నాకు గురువుసుమీ. నిన్ను దేహాభిమానంబున దూరముగా బొమ్మనలేదు. ఆత్మజిహీర్షచేతను బొమ్మనలేదు. తరుభయతాదాత్మ్యా ధ్యాసచే నట్లంటివి. నీవు నే జెప్పిన యట్టివాడవైనచో నాకు గురుండవే యని పలుకుచున్న సమయంబున.

సీ. సుమనస్తరంగిణీ కమనీయ జటలతో
           నాగరాట్సువిభూషణములతోడ
    నద్రికన్యాచంద దర్ధదేహముతోడ
           మృదుహాసలలితచంద్రికలతోడ
    నుద్యత్కరీంద్ర చర్మోత్తరీయముతోడ
           మకుటనిప్తార్ధశీతకరుతోడ
    ధవళప్రభాధగగ్ధగితగాత్రములతో
           సత్సాధనాఢ్యహస్తములతోడ.

గీ. విమల గోరాజ వాహనోత్తమముతోడ
    బ్రమథగణ సేవితాంఘ్రి పద్మములతోడ
    విశ్వనాథుండు మాతంగు విధమువిడిచి
    శంకరాచార్యనెదుట సాక్షాత్కరించె.

అట్లు ప్రత్యక్షంబైన యాజగద్రక్షకుంగాంచి శంకరుండు మేను పులకింప భయభక్తి వినయ విస్మయ సంభ్రమకలిత హృదయుండై సాష్టాంగ నమస్కృతులుగావించి ముకుళిత కరకమలుండై యిట్లు వినుతించెను.

గీ. దేహదృష్టిచే ద్వదీయదాసుల జీ
    వాత్మదృష్టిచేఁ ద్వదంసకుండ
    నాత్మదృష్టిచేత నైతి నీవే నేను
    దేవ! యిదియెనాదు దృఢమతలాస.

సీ. శాస్త్రమెంతయు సమంజసమగుఁగాని శ్రీ
           గురుకృపాగరిమ చేకూరకున్న
    చదువదేమిటికి నెంచంగనట్టియాచార్య
           కరుణగల్గినను జక్కఁగసుబోధ
    ముదయింపఁగా జేయకుండిన ఫలమేమి
           కలిగించుఁబోదాని గరిమనవియు