పుట:కాశీమజిలీకథలు-05.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

కాశీమజిలీకథలు - ఐదవభాగము

బొమ్మంటివి. సత్యజ్ఞానానందస్వరూపంబగు బ్రహ్మతత్వము సర్వాంతర్యామియై యుండెనని శ్రుతిశేఖరంబులు వక్కాణింపుచుండ నీకీభేదబుద్ధి యేమిటికిఁ గలుగఁవలయును. నీవు నిగమాంతంబులఁ జూచియున్నచో నిట్లనవని తలంచెదను. దండకమండవులందాల్చి కాషాయాంబరములు మేనం బొలుపుఁజెంద యతివేషంబు ధరించి కొందరు జ్ఞానగంధరహితులయ్యుఁ బ్రౌఢవాక్యంబులచే గృహస్తుల వంచింపుచుందురు గదా!

విద్వాంసుడా? నీవు దూరముగా దేహమును బొమ్మంటివా చెప్పుము. దేహమునంటివేవి యన్నమయమగు నీ దేహమునకును నా దేహమునకును భేదమేమి యున్నదిఁ దేహినంటివేని ప్రత్యగాత్మకు మునుపే భేదము లేదుగదా వీఁడు బ్రాహ్మణుం డనియు వీఁడు శ్వపచుండనియు నీవు ప్రత్యగాత్మయందు భేదవిచారము చేయఁ గలవాయేమి. సూర్యబింబము గంగయందును సురయందునుంగూడ ప్రతిఫలింపదా? అతిపవిత్రంబగు బ్రాహ్మణశరీరమునకును, నతిపాపిష్టుండగు ఛండాలు శరీరమునకును భేదములేదా? దానంజేసి దూరముగాఁ బొమ్మంటినని పలికెదవేని మునివర్యా! వినుము, అచింత్యుఁడు నవ్యక్తుండు ననంతుండు పరిపూర్ణుండగు పురాణపురుషుండు సర్వశరీరములయందు సూత్రముపగిది నుండుట యెరింగియు నిట్లనుట యనుచితంబ. కరికర్ణాంతవిలోలమగు నీ కళేబరమున నహంభావము నీకేటికిఁ గలుగవలయును. ముక్తిమార్గదర్శకమగు విద్యను సంగ్రహించియు నీకీ తుచ్ఛసంగ్రహేచ్చ గలిగిన దేమి? అన్నన్నా? మహామాయావియగు పరమేశ్వరుని యింద్రజాలంబున మహాత్ములుసైతము మునుంగుచుందురు గదాయని పలికి యూరకుండెను. వానిమాట లాలించి యత్యుదార చరితుండగు శంకరుండు విస్మయావేశ హృదయుండై యల్లన నిట్లనియె.

దేహభృత్ప్రవరా? నీవు పలికినదంతయు యథార్థమగును. ఆత్మవేత్తవగు నీ వాక్యంబులచే నీయందుఁ జండాలబుద్ధిని విడిచితిని. లోకంబునఁ గొంద రుపనిష దర్ధముల శ్రవణముచే దెలిసికొనుచున్నారు. కొందరు జితేంద్రియులు మననము జేయుచున్నారు. మరికొందరు నిదిధ్యాసనము జేయుచున్నారు. కాని యెవ్వరును బుద్ధియందు గల భేదభావమును విడలేకున్నవారు.

ఎవ్వనికి నెల్లపుడు జగంబంతయు నాత్మస్వరూపమున దోచునో యట్టి వాడు ద్విజుం డైనను శ్వపచుండైనను వందనీయుడని నా దృఢమైన నిశ్చయము. బ్రహ్మ విష్ణు శివాదులయందే చైతన్యంబు స్ఫురించుచున్నదియో యదియే పశుపక్షికీటకాదులయందును బ్రకాశించుచున్నది. అదియే నేను. అంతకన్న దృశ్యము మరి యొకటి లేదని సంతతము నెవ్వని మనంబున దోచుచుండునో వాడు ఛండాలుండై నను నాకు గురువగుగాక. పెక్కులేల? ఈ లోకంబున విషయానుభవకాలంబున విషయదర్శకమగుబోధ యెద్దిగలదో సర్వోపాధిసూన్యమగు నాతెలివియే నేను.