పుట:కాశీమజిలీకథలు-05.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

53

యాశ్రమ మను నోడ నెక్కించి కృపారసనౌకాదండ సహాయంబున దరింజేర్చుటయుఁ గ్రమంబున నతని వాడుక నలుదెసల వ్యాపించినది. మరియు నాయవిముక్త క్షేత్ర వాసులగు జనులాయతి పతి నారాధించి వక్రమార్గమున నడుచుచున్నను దమబుద్ధిని సాధువగు నట్లు నియమించుకొనిరి.

విశ్వేశ్వర దర్శనము

మరియొకనాఁడు కిరణ నికరంబుల ఖరకరుండువోలెఁ బ్రసూన సంతానంబులఁ బారిజాతంబట్లు శంకరయతి మిట్టమధ్యాహ్నంబునఫాలలోచన లోచనాగ్నింబోలె దపనకాంతశిలలు విస్ఫులింగజ్వాలలఁ గ్రక్కుచుండఁ జండభానుండు బ్రహ్మాండకరండమును మంగలము పగిదివేప నోపికతో గంగానదికి నాహ్నిక కృత్యముల నిర్వర్తింప నరుగుచు ముందర :-

సీ. నాల్గుకుక్కలకుఁ గంఠములఁ జిక్కపుత్రాళ్ళ
           దగిలించి ముడిచి చేతనుధరించి
    మెలితోలు మొలత్రాటఁ గలిపి కూర్చిననీలి
           గోచిముంగిటను చెంగులనుదీర్చి
    కఠినాంగకములందుఁ గలయఁబూసిన సురా
           రసము వాసనలెల్ల దెసలఁ గ్రమ్మ
    చింతనిప్పుల భంగి వింతగా నెరుపెక్కు
           కరకుచూపులు భయంకరముగాఁగ.

గీ. వారుణీ పానమత్తత మీఱఁ దూలి
   పడుచు లేచుచు నవ్వుచుఁ బాడికొనుచు
   వింతమాటల జనుల నవ్వించుచొక్క
   మాలఁడెదురయ్యె నయ్యతి మౌళికపుడు.

వానిరాక కేవగించుకొనుచు శంకరాచార్యుండు.

క. ఓరీ చండాలుండా
   సారాచారపార సంపన్నులమౌ
   పారులము మమ్మెరుంగవో
   దూరముగాఁ బొమ్మ దరియ దోషముసుమ్మా.

ఆ మాటలు విని యామాఁలడట్టె నిలువంబడి కడు నెరుపెక్కియున్న కన్నులెత్తి చూచుచు ఓహో! నీ యాకారంబుచూడఁ గొప్పవాఁడవువలెఁ గనంబడుచుంటివి. మాటలు విపరీతముగాఁ దోచుచున్న వేమి? నన్నేమిటికి దూరముగాఁ