పుట:కాశీమజిలీకథలు-05.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

కాశీమజిలీకథలు - ఐదవభాగము


సనందుని ప్రవేశము

అట్లు శంకరాచార్యుండు కాశీపురంబున వసియించి యున్న సమయంబున నొకనాఁడొక విప్రకుమారుండు బ్రహ్మచారి బ్రహ్మతేజంబున దెసలం బ్రకాశింపఁ బద్మపత్రంబులఁ బరిఢవించి నేత్రంబులు నాజానుబాహువులం గలిగి చూచువారి కచ్చెరువు గలుగఁజేయుచు దురంతరంబగు సంసార సముద్రమును గురుకారుణ్య నౌకా సహాయంబున దాట నిశ్చయించి వైరాగ్యబుద్ధితో వచ్చి శంకరుని పాదంబులంబడి నమస్కరించెను. అప్పుడమ్మహాత్ముండతని లేవలెత్తి నీ వెవ్వడవుఁ నీ నివాసమెచ్చట నేమిటికిట్లు వచ్చితివి? నీ వృత్తాంతం బెరింగింపుమని యడిగిన నవ్వటూత్తముం డిట్లనియె. ఆచార్యా! నేను బ్రాహ్మణుడను. కావేరీనదీ విరాజితమగు చోళదేశము మదీయనివాసము మహాత్ములదర్శించు నుత్సుకతతో నిల్లు వెడలి తిరిగితిరిగి యిచ్చటికి వచ్చితిని. మత్పూర్వపుణ్యపరిపాకంబున నిన్నుఁ గనుఁగొంటి మహాత్మా సంసారసముద్రంబున మునిఁగిన జనులు నుద్ధరింపఁగంకణము గట్టికొంటివని నీ వృత్తాంతమాలించి నిన్నాశ్రయించ వచ్చితిని. అమృతఝరభంగములగు నపాంగములచె నన్ను వీక్షింపుము మద్గుణదోషంబుల విచారింపవలదు. వీఁడనర్హుఁడని నన్ను విడచితి వేని నిన్ను నిరవధిక కృపారధి వని యెవ్వరు స్తుతియింతురు! నీవు దీనదయాళుండ వైనచోఁ గారుణ్యంబున నన్ను రక్షింపకమానవు. మరుస్థలంబున వర్షించిన మేఘమునే యెక్కుడుగాఁ గొనియాడుదురు. నా మానసంబు భవదీయ సారస్వత సుధాసాగరజలంబులం గ్రీడింప నుత్సుకత్వముఁ జెందుచున్నది. ఆహా! భవదుక్తి ప్రవృత్తి యందు శ్రద్ధగల సుద్ధాద్వైతవేత్త సూర్వచంద్ర పురందరాది బృందారక పురగతంబులగు దివ్యభోగంబుల నతి నీచంబులు గాఁదలంచునుగదా! తావకవాక్యామృతంబు శ్రుతిపుటంబులం గ్రోలినవాడు విషయసుఖంబుల విషవల్లీఫలసఖంబులగాఁ దలంచును. రంభాఘనస్తనపరీరంభారంభోజ్వలంబగు పౌరందరలోకపుణ్యం బగణ్యంబుగా నెంచును. విరించి పదంబున ననాదరము వహించును.

అయ్యారే! పూర్వఖర్వతపఃపచేశిమఫలంబులు సంసార వైరాయమాణంబులు, సర్వాధిహరణంబులునగు తావకచరేణసేవానివహంబులు మామక మానసమాసక్తిఁ జెందియున్నది. దేవా! నేను సంసారబంధామయ విముక్తి కొరకు నిన్నాశ్రయించుచుంటి. ఈ తెవులు బాపుట కుదయించిన వైద్యుఁడవు నీవని యెల్లరుం జెప్పు చున్నారు. నన్ను రక్షింపుమని వేఁడుకొనియెను. శంకరార్యు లతని మాటలు విని సంతసించుచు వాని భక్తి విశ్వాసములు మెచ్చుకొని యొకనాఁడు యథాశాస్త్రముగా బ్రహ్మభావమతని కుపదేశించి సన్యాస మిప్పించెను. అతండే శంకరాచార్యుల ప్రథమశిష్యుడని వాడుకఁబడసిన సనందనుఁడు, తరువాత నాసనందనుచే నట్లు సంసారసాగరంబున మునుంగకుండ నుద్ధరింపుమని ప్రార్ధింపంబడి వామదేవాది శిష్యులఁ దురీ