పుట:కాశీమజిలీకథలు-05.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

51

ధ్యాసలచే నీ వార్షిక దినములను గడిపి మహాత్ములీ శరత్సమయంబునఁ బాదరజంబున జగంబుఁ బవిత్రము సేయుచు సంచరింతురు. కావున నీ విప్పుడు కాశీపట్టణమున కరుగుము అందు వేదచోదితమగు త్తత్వపద్ధతి వివరింపుమని పలికి వెండియు నిట్లనియె.

తొల్లి యొకప్పుడు హిమగిరియం దత్రిమహాముని సత్త్రయాగము గావించెను. తదా లోకనార్ధమై త్రిలోకంబులంగల తాపసులచ్చోటికి విచ్చేసి వేదశాస్త్ర పురాణగోష్ఠులతోఁ గాలక్షేపము గావించుచుండిరి. అమ్ముని సభామండలమున రెండవ పుండరీకభవుండువోలె నొప్పుచు వ్యాసభట్టారకుండొకనాఁ డుపనిషత్తుల కర్ధముజెప్పుచుండ విని వినయంబునఁ జేతులుజోడించి యిట్లంటిని. మహాత్మా! నీవు నాలుగు వేదంబులను విభజించితివి. భారతంబు రచించితివి. యోగశాస్త్రముఁ జెప్పితివి. బ్రహ్మసూత్రములు నిర్మించితివి. లోకంబునకు మంచి యుపకారంబు గావించితివి. కాని యా సూత్రములకుఁ గొందరువిపత్రిపన్నులు తమతమ మతానుసారముగా విపరీతార్థములం గల్పించుచున్నవారు. కావున నీవా సూత్రంబులకు నిశ్చయార్ధంబు దేటపడు నటుల భాష్యంబు రచియింపు మిదియే నా ప్రార్ధనయని పలికిన విని యమ్మహాత్ముండు నవ్వుచు నిట్లనియె. సూరివరేణ్యా! పూర్వ మొకప్పుడు కైలాశమందీ విషయమే వేలుపులును బ్రస్తావించిరి. వినుము. ముందు నాయంతవాఁడు నీకు శిష్యుండు కాఁగలడు. ఆ సర్వజ్ఞునిచే నభిమంత్రితంబగు కుంభము నర్మదానదీ ప్రవాహోదక మంతయుఁ ద్రుటిలోఁ బానముఁ జేయఁగలదు. అదియే నీకు గురుతు. ఆ పండితశేఖరుండే దుర్మతంబుననెల్ల ఖండించుచు మదీయ బ్రహ్మసూత్రములకు యథార్థముగా భాష్యముఁ జేయఁ గలఁడు. తన్మూలంబున నీ కీర్తియు లోకంబుల నెల్ల వ్యాపించును. ఇదియే కైలాసంబునందేలిన విషయమని చెప్పి యా వ్యాసమహర్షి యెందేనింపోయెను. శంకరా! అమ్మహర్షి యెరింగించిన విషయంబులన్నియు నీ యందు గనంబడుచున్నవి. నీవు సర్వోత్తముఁడవు. తత్వజ్ఞానంబున నిన్నుఁ బోలిన వారెందును లేరు. కావున నజ్ఞానంబునం గొట్టుకొను లోకము నుద్దరింపఁ బ్రయత్నింపుము. కాశి కరిగి యందు సూత్ర భాష్యము రచించుము. ఇది దేవసమ్మతము. అని పలికి నిర్మలమగు దృష్టి ప్రచారములచేఁ బవిత్రముఁజేయు వాఁడు వోలె శంకరాచార్యుం జూచెను.

అప్పుడు శంకరుండు తత్పాదపంకేరూహంబులకు నమస్కరింపుచుఁ దదనుజ్ఞగైకొని యెట్టకేఁ గదలి కతిపయప్రయాణంబులఁ గాశీపట్టణంబునకుఁ జనియెను. అందు గంగానదిం గృతావగాహుండై విశ్వనాథు నర్చించి యన్నపూర్ణం గొలిచి వటుకభైరవాదులు సేవించి మరియుంగల తీర్ధంబులనెల్ల మోక్షలక్ష్మింగొల్లాడి సద్గోష్ఠం గాలక్షేపము జేయుచుఁ గొన్ని దినంబులు కాశీపట్టణంబున వసించెను.