పుట:కాశీమజిలీకథలు-05.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

కాశీమజిలీకథలు - ఐదవభాగము

యిష్టము వచ్చినట్లు చేసికొమ్మని యనేక ప్రకారములఁ బ్రతిమాలికొనియెను. అప్పు డతం డేమియుఁ జెప్పలేక యూరకుండి యాత్మగతంబున నోహో యీమె మోహము మిక్కిలి బలముగానున్నది. సన్యాసస్వీకారమున కాజ్ఞయియ్యదు. తదాజ్ఞలేక యది స్వీకరింపరాదు. ఏమి చేయుదునని తలంచి తదుపాయ మరయుచుఁ గొన్నిదినములు గడిపెను.

శంకరుఁడు మకరగ్రస్తుడై తల్లిని సన్యాసమున కాజ్ఞ యిమ్మనుట

ఎనిమిదవయేట శంకరుండొకనాఁడు ప్రాతఃకాలమునఁ బూర్ణానది కరిగి యందుస్నానము జేయుచుండఁ దన చెడురూపువాపి రక్షింపుమని శరణుఁజొచ్చు నట్లొక మకర మతని చరణంబులఁ బట్టికొని లాగఁదొడంగినది. జలస్తంభనాది విద్యా ప్రవీణుండైనను దనకార్యము సాధింప నిదియే సమయమని నిశ్చయించి యిటునటు గొట్టుకొనుచు. అమ్మా? రక్షింపుము రక్షింపుము. నన్నొక మొసలిపట్టుకొని లాగుచున్నదని పెద్ద కేక పెట్టెను. ఆ రోదనవిని యింటగృహకార్యములు చక్కఁబెట్టుచున్న సతీదేవి శోకపరవశయై గుండెలు బాదుకొనుచు, నొక్కడుగున రేవుఁజేరి నట్టేటం గొట్టుకొనుచు మున్గుచుఁ దేలుచున్న కొడుకుంజూచి అయ్యో అయ్యో హా పుత్త్రా ! హా పుత్త్రా యని యరచుచు లోతునీటందిగవలదని పలుమారు బోధించినను నా మాటఁ బాటింపక నీ యేదికేటికి వచ్చితివి? ఇఁక నాకు దిక్కెవ్వరు? మా శంకరుని మకరము బట్టినది వచ్చి రక్షింపరో మీ పాదములకు మ్రొక్కెదనని యరచుచు నతని మోముదమ్మింజూచుచు రక్షకుల జాడ నరయుచుఁ బలుతెరంగుల జితింపదొడంగినది. కాని సాహసించి యేటిలో దిగలేకపోయినది ప్రాణములకన్న తీపగునది మరియొకటి లేదుగదా.

అప్పుడు శంకరుఁడు, "అమ్మా! నీవు సన్యాసము గైకొంటివేని నిన్ను విడిచెదనను మాట యొకటి నీటినుండి బయలువెడలుచున్నది. సత్యముకావచ్చును. అందులకు నీవంగీకరింతువే" యని యడిగిన విని యామె యోహో? యిది కపటమాయేమి? వీడిదివరకుఁ బలుమారు సన్యాసముఁగైకొనఁ బ్రార్ధించియున్నాఁడు. ఇట్లడిగిన నేను సమ్మతింతునని కాఁబోలు నేమిచేయుదునని డోలాయితచిత్తయై యున్నంత శంకరుం డొక మునుంగుమునిఁగి యంతలోఁ దేలి తల్లి కిట్లనియె.

తల్లీ ! యిది కడపటిమాట యిఁక నిలుచుటకు శక్యముకాదు. మకరగ్రహణ వేదన బరుగుచున్నది యిదిగో మ్రొక్కుచుంటి సన్యాసమునకో, స్వర్గమునకో యాజ్ఞ యిమ్మని వేఁడుకొనియెను.